సాగరమాల ప్రాజెక్టుతో మత్స్యకార కుటుంబాలకు మేలు

* జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి

UPDATED 11th AUGUST 2020 TUESDAY 7:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న సాగరమాల ప్రాజెక్టు ద్వారా జిల్లాలో తీరప్రాంత ప్రదేశాలు అభివృద్ధితో పాటు లక్షలాది మంది మత్స్యకార కుటుంబాలకు మేలు చేకూర్చే విధంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. సాగరమాల ప్రాజెక్టు చైర్మన్ శారదా ప్రసాద్ దేశంలో ఉన్న 77 తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు, రాష్ట్రస్థాయి అధికారులతో జూమ్ యాప్ ద్వారా మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాగరమాల ప్రాజెక్టు ద్వారా పోర్టులు, టూరిజం ప్రాజెక్టులు, ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి తో పాటు మౌలిక సదుపాయాల కల్పన, ఫిష్ ల్యాండింగ్, స్కిల్ డవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు, ఎడ్యుకేషన్ డవలప్ మెంట్ ప్రోగ్రామ్స్ చేపట్టడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో తీర ప్రాంత అభివృద్ధి లో భాగంగా తొండంగి మండలంలో జిఎంఆర్ గ్రూప్ సంస్థ పోర్టు ఏర్పాటు చేయడం జరుగుతుందని, అలాగే రాష్ట్ర మారిటైన్ బోర్డు రూ.100 కోట్లతో యాంకరేజ్ పోర్టు అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. ఉప్పాడ వద్ద రూ.350 కోట్లతో కొత్తగా ఒక ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, దీనికి సంబంధించి త్వరలోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్ఈ పోర్టు జి.వి. రాఘవరావు, మత్స్యశాఖ జెడి పి. కోటేశ్వరరావు, డిఐపిసీ జిఎం బి. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us