Updated 4th November 2023 Saturday 9:15 pm
Vadapalli: వరదహస్తం దాల్చినవేంకటాద్రిరాయుడు అనన్య భక్తుడైన హనుమంతవాహనంపై ఊరేగడం భక్తులకు కనువిందయ్యింది. కోనసీమతిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం తిరువీధుల్లో నిర్వహించిన ఈ వాహన సేవ.. కృతయుగంలో నృసింహస్వామిగా, త్రేతాయుగంలో శ్రీరాముడిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా,కలియుగంలో వేంకటేశ్వరుడిగా స్వామి అవతరించారన్న సందేశాన్ని చాటింది. ఉదయం విష్వక్సేన పూజ, సప్తకలశారాధన అభిషేకం, ప్రధాన హోమం, సహస్ర దీపాలంకరణ సేవ తదితరాలను పండితుడు ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు నేతృత్వంలో శాస్త్రోక్తంగా జరిగాయి. దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఉమాదేవి దంపతులు, దేవాదాయశాఖ ఆర్జేసీ సురేష్ బాబు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, హైమాపార్వతి, ఎంఎస్ఆర్ దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.







