I&PR : సమాచార శాఖలో ‘ఫెవికాల్’ వీరుడు

UPDATED 20 FEBRUARY 2026 3:30 PM

30 ఏళ్లుగా ఒకేచోట తిష్ఠ

ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా.. ఆయన సీటు మాత్రం కదలదు!

కాకినాడ, రెడ్ బీ న్యూస్, ఫిబ్రవరి 20 : జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖలో ఆయనో మోనార్క్.. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు అనేవి సహజం. కానీ ఆ అధికారికి మాత్రం ఇవేవీ వర్తించవు. ఆ అధికారి మాత్రం ఏకంగా సుమారు 30 ఏళ్లుగా ఒకే విభాగంలో ఒకే చోట తిష్టవేసి రికార్డు సృష్టిస్తున్నారు.

నిబంధనలకు పాతర.. చక్రం తిప్పడంలో దిట్ట!

సాధారణంగా ఏ ప్రభుత్వ విభాగంలోనైనా మూడు లేదా ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం ఒకే చోట పనిచేస్తే బదిలీ చేయడం నిబంధన. ముఖ్యంగా కీలకమైన సమాచార శాఖలో పారదర్శకత అవసరం. కానీ, సదరు  అధికారి  మాత్రం తనకున్న రాజకీయ పలుకుబడితో, పైస్థాయి అధికారులను మచ్చిక చేసుకునే నేర్పుతో సుమారు మూడు దశాబ్దాలుగా అక్కడే కొనసాగుతున్నారు.

శాశ్వత చిరునామా..

శాఖలో పనిచేసే ఇతర ఉద్యోగులు వస్తూ పోతుంటారు, కానీ ఈయన మాత్రం ‘శాశ్వత సభ్యుడి’లా ఉండిపోయారు. సుదీర్ఘ కాలం ఒకే చోట ఉండటంతో శాఖలోని లొసుగులన్నీ ఆయనకు కరతలామలకం అయ్యాయి. దీనితో ఫైళ్ల కదలికల నుంచి కాంట్రాక్టుల వరకు అన్నింటిలోనూ ఆయనే చక్రం తిప్పుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దశాబ్దాలుగా ఒకే వ్యక్తి కీలక బాధ్యతల్లో ఉండటం వల్ల క్రింది స్థాయి ఉద్యోగులకు రావాల్సిన అవకాశాలు దక్కడం లేదు. కొత్త ఆలోచనలతో వచ్చే యువ అధికారులను తొక్కేస్తున్నారని, తన మాట వినే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని శాఖలో అంతర్గత చర్చ జరుగుతోంది.

అక్రిడేషన్ల దందా: అనర్హులకు పీట.. అర్హులకు వేటు!

ఈ సుదీర్ఘ కాలంలో ఆయన సాధించిన అతిపెద్ద "విజయం" ఏమిటంటే మీడియా అక్రిడేషన్ల జారీ ప్రక్రియను తన గుప్పిట్లోకి తెచ్చుకోవడం. ఈ విభాగంలో ఆయన ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. క్షేత్రస్థాయిలో పనిచేసే జర్నలిస్టులకు అక్రిడేషన్లు దక్కడం గగనమవుతుంటే, అసలు కలం పట్టని వారికి, కేవలం ఈయన అనుచరులకు, పైరవీకారులకు యథేచ్ఛగా కార్డులు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రిడేషన్ల జారీలో భారీగా చేతులు మారుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. తన కనుసన్నల్లో మెలిగే వారికి, ‘మామూళ్లు’ సమర్పించే వారికే తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.

జర్నలిస్టుల ఆవేదన..

ఏళ్ల తరబడి పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులకు సాంకేతిక కారణాల సాకుతో వేధిస్తూ, అక్రిడేషన్లు రాకుండా అడ్డుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. అక్రిడేషన్ల జారీలో జరిగిన అక్రమాలపై ఆయన వెనుక ఉన్న పెద్దల పాత్రపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే బదిలీ చేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు.

విచారణ జరిగేనా..?

అవినీతి రహిత పాలన అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం, ఇలాంటి ‘పాతుకుపోయిన’ అధికారులపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకే చోట 30 ఏళ్లుగా ఉండటం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఆయన వెనుక ఉన్న పెద్దలు ఎవరు? అన్న కోణంలో విచారణ జరిపి, శాఖలో ప్రక్షాళన చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us