UPDATED 21st FEBRUARY 2026 5.10 PM
ప్రతివాదులుగా జిల్లా కలెక్టర్, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్, రాష్ట్ర సమాచార శాఖ కమీషనర్
కాకినాడ, రెడ్ బీ న్యూస్, ఫిబ్రవరి 21: జర్నలిజం వృత్తికి గుర్తింపుగా ఇచ్చే ‘మీడియా అక్రిడేషన్’ కార్డులను సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు సంతలో సరుకుల్లా మార్చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్హత ఉన్న జర్నలిస్టులను వీధులపాలు చేస్తూ, పైరవీకారులకు, రాజకీయ అనుచరులకు రెడ్ కార్పెట్ వేస్తున్న అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో మీడియా అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియలో ప్రభుత్వ నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా అక్రిడేషన్ కార్డుల జారీ చేస్తున్నారని ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరుతూ ప్రతివాదులుగా జిల్లా కలెక్టర్, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్, రాష్ట్ర సమాచార శాఖ కమీషనర్ లపై లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. కాకినాడ జిల్లాలో మీడియా అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని, అర్హత లేని వ్యక్తులు, సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా కార్డులు మంజూరు చేశారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో జర్నలిస్టులుగా పనిచేయని, ఎలాంటి అర్హత, అనుభవం లేని వారికి అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసినట్లు ఆరోపించారు. అక్రిడేషన్ కమిటీలోని కొందరు సభ్యులు, ఐ అండ్ పీఆర్ అధికారులు కుమ్మక్కై కార్డులు మంజూరు చేశారని, దరఖాస్తుల పరిశీలనలో అధికారులు కనీస నిబంధనలు పాటించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని, ప్రస్తుత దరఖాస్తులను మళ్లీ క్షుణ్ణంగా పరిశీలించాలని, ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని లోకాయుక్తకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.







