"స్పెషల్ గ్రేడ్" దిశగా పెద్దాపురం మున్సిపాలిటీ..!

UPDATED 5th FEBRUARY 2026 7:00 AM

* శతాబ్దాల చరిత్ర, శరవేగంగా అభివృద్ధి
* స్పెషల్ గ్రేడ్ హోదా కోసం వేచిచూస్తున్న "సిల్క్ సిటీ"
* ఇప్పటికే కౌన్సిల్ ఏకపక్ష ఆమోదం
* హోదా దక్కితే కాకినాడ జిల్లాలో మోడల్ పట్టణంగా మారే అవకాశం

రాష్ట్రంలో అత్యంత పురాతనమైన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన పట్టణాల్లో పెద్దాపురం పట్టణం (Peddapuram Town) ఒకటి. 1915లో రాష్ట్రంలోనే రెండవ మున్సిపాలిటీగా ఏర్పడింది. శతాబ్ద కాలం పూర్తి చేసుకున్న ఈపట్టణం ఇప్పుడు స్పెషల్ గ్రేడ్ హోదా కోసం అన్ని అర్హతలను సంతరించుకుంది. పారిశ్రామికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందుతున్న పెద్దాపురం పట్టణ స్థాయిని పెంచాలని స్థానికుల నుంచి డిమాండ్ బలంగా వినిపిస్తోంది. శతాబ్దాల కాలం నాటి ఘనమైన చరిత్ర కలిగిన ఈ మున్సిపాలిటీ ఇప్పుడు ఆధునిక అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. అందుకు సంబంధించిన అన్ని అనుమతులు మున్సిపల్ అధికారులు సిద్ధం చేశారు. చారిత్రక నేపథ్యం కలిగిన పెద్దాపురం పట్టణం నేడు ఆధునిక అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది.

పెద్దాపురం, రెడ్ బీ న్యూస్, ఫిబ్రవరి 5  : రాష్ట్రంలో పురాతన పట్టణాల్లో ఒకటిగా, ఘనమైన చారిత్రక నేపథ్యం కలిగిన పెద్దాపురం పట్టణం నేడు ఆధునిక అభివృద్దివైపు శరవేగంగా దూసుకుపోనుంది. 1915లో గ్రేడ్ - 3 మున్సిపాలిటీగా ఏర్పడి 2009లో గ్రేడ్ -2 మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ (Upgrade) అయ్యింది. ఈ పట్టణం రాష్ట్రంలో రెండవ అతిపురాతన మున్సిపాలిటీగా రికార్డు సృష్టించింది. శతాబ్దకాలం పైబడిన ఈప్రస్థానంలో ఇప్పుడు సరికొత్త మైలురాయిని చేరుకోవడానికి సిద్దంగా ఉంది. సాధారణంగా ఒక మున్సిపాలిటీ స్పెషల్ గ్రేడ్ గా గుర్తించాలంటే ప్రభుత్వం కొన్ని ప్రామాణికాలను పరిగణలోకి తీసుకుంటుంది. పట్టణానికి స్పెషల్ గ్రేడ్ హోదా లభిస్తే నిధుల కేటాయింపు పెరగడంతోపాటు పట్టణం మరింత ఆధునీకరణకు నోచుకునే అవకాశం ఉంది. గత చరిత్రను గౌరవిస్తూనే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకోవడానికి పట్టణానికి ఈహోదా అత్యంత కీలకం కానుంది. త్వరలోనే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది.

స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా మారితే వచ్చే మార్పులు..

ప్రస్తుతం ఉన్న గ్రేడ్ నుంచి స్పెషల్ గ్రేడ్ కు పదోన్నతి లభిస్తే పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. మున్సిపల్ కమీషనర్ స్థాయి పెరగడంతోపాటు పాలనారమైన నిర్ణయాల్లో వేగం పెరుగుతుంది.

పారిశుధ్యం, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో మరిన్ని పోస్టులు మంజూరు అవుతాయి. ఫలితంగా డ్రైనేజీ, తాగునీరు సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడం, వీధి దీపాలు, అంతర్గత రహదారులు, పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉంది.

స్పెషల్ గ్రాంట్ల ద్వారా పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చు.

రాష్ట్ర, కేంద్ర  ప్రభుత్వాల నుంచి మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా గ్రాంట్లు విడుదలవుతాయి.

పట్టణంలో 24 గంటల తాగునీటి సరఫరా, అత్యాధునిక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థల కోసం రూ. కోట్ల నిధులు నేరుగా వచ్చే అవకాశం ఉంటుంది.

పెరుగుతున్న ట్రాఫిక్ కు అనుగుణంగా పట్టణ విస్తరణకు నిధులు మంజూరవుతాయి.

ప్రస్తుతం ఉన్న గ్రేడ్-1 కమీషనర్ స్థానంలో స్పెషల్ గ్రేడ్ కమీషనర్ వస్తారు. వీరికి ఆర్థిక అధికారాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల చిన్నచిన్న పనులకు కూడా పైఅధికారుల అనుమతికోసం వేచిచూడాల్సిన అవసరం ఉండదు.

టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీపీ స్థాయి అధికారి, ప్రజారోగ్య విభాగంలో అదనపు సిబ్బంది నియమితులవుతారు.

ప్రస్తుత సవాళ్లు ఏమిటి..

పట్టణం శరవేగంగా విస్తరిస్తున్నా పాత కేడర్ స్ట్రెంత్ ఉండడం వల్ల పారిశుధ్యం, పన్నుల వసూళ్లలో జాప్యం జరుగుతోంది. కొన్ని సమీప గ్రామాలను మున్సిపాలిటీలో కలిపితే జనాభాపరంగా స్పెషల్ గ్రేడ్ హోదా మరింతగా బలపడుతుంది. అయితే దీనిపై స్థానిక గ్రామాల అంగీకారం, రాజకీయ నిర్ణయం కీలకం కానుంది. పెద్దాపురం మున్సిపాలిటీకి స్పెషల్ గ్రేడ్ రావడం అనేది కేవలం హోదా మాత్రమే కాదు అది పట్టణ జీవన ప్రమాణాలను పెంచే ఒక గొప్ప అవకాశం. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటే ఈచారిత్రాత్మక పట్టణం మరింత ఆధునీకరించబడుతుంది.

పట్టణం :  పెద్దాపురం
విస్తీర్ణం : 41.15 చ.కి.మీ
వార్డులు : 29
​జనాభా : 57,779
​ఇళ్లు (అసెస్మెంట్లు) : 14,612
​నీటి పన్నులు (అసెస్మెంట్లు) : 8,168
​వార్షిక ఆదాయం (2024-25) : రూ. 11.58 కోట్లు
​మున్సిపల్ పాఠశాలలు : 26
​ప్రభుత్వ పాఠశాలలు : 3
​ప్రైవేటు పాఠశాలలు : 16
​ప్రైవేటు కళాశాలలు : 4
​ఆసుపత్రులు : 35
​ఫంక్షన్ హాళ్లు : 15
​హోటళ్లు, రెస్టారెంట్లు : 15
​సినిమా థియేటర్లు : 4
​కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ : 1353

పట్టణ రూపురేఖలు మారిపోతాయి

​పెద్దాపురం మున్సిపాలిటీ స్పెషల్ గ్రేడ్ హోదా దిశగా అడుగులు వేస్తుండడం పట్టణ అభివృద్ధికి ఒక గొప్ప మలుపు.  స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా మారడం వల్ల ప్రభుత్వ పద్దుల నుంచి అదనపు నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఆధునీకరణ, నాణ్యమైన రహదారుల నిర్మాణం వేగవంతం అవుతుంది. అలాగే పౌరులకు అందే సేవల్లో జవాబుదారీతనం, అదనపు సిబ్బంది కేటాయింపు జరిగే అవకాశం ఉంది. దీనివల్ల భవన నిర్మాణ అనుమతులు, పన్నుల చెల్లింపులు, ఇతర సేవలు సరళతరం అవుతాయి. స్పెషల్ గ్రేడ్ హోదాపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడడమే ఇక తరువాయి.
​కె. శ్రీకాంత్ రెడ్డి
మున్సిపల్ కమీషనర్
పెద్దాపురం

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us