I&PR : సమాచార శాఖలో అక్రిడేషన్ల ‘మాఫియా’?

UPDATED 18th FEBRUARY 2026 4:30 PM

నిబంధనలు గాలికి 

అర్హులకు మొండిచేయి!

అక్రిడేషన్ల ప్రక్రియపై రాష్ట్ర కమీషనర్‌కు ఫిర్యాదు..

కాకినాడ, రెడ్ బీ న్యూస్, ఫిబ్రవరి 18 : కాకినాడ జిల్లాలో మీడియా అక్రిడేషన్ కార్డుల జారీ వ్యవహారం అత్యంత వివాదాస్పదంగా మారింది. జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కి అనర్హులకు అక్రిడేషన్లు కట్టబెడుతున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దశాబ్దాలుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ, ప్రజా సమస్యలపై గళమెత్తే జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంలో అధికారులు కొర్రీలు పెడుతున్నారు. అసలు కలంపట్టని, అనుభవం లేని వారికి ‘రెడ్ కార్పెట్’ వేస్తున్నారు. జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ (DMAC) సమావేశాలు కేవలం రబ్బర్ స్టాంపుల్లా మారాయని, లోపాయికారీ ఒప్పందాలతోనే జాబితాలు సిద్ధమయ్యాయని పలువురు జర్నలిస్టులు మండిపడుతున్నారు. చిన్న పత్రికలను టార్గెట్ చేస్తూ సాంకేతిక కారణాలను బూచిగా చూపి వారి దరఖాస్తులను బుట్టదాఖలు చేస్తున్నారు. అదే సమయంలో జిల్లాలో ఉనికిలో లేని పత్రికలకు పైరవీకారుల అండదండలతో అక్రిడేషన్లు కేటాయించడంపై జర్నలిస్టులు మండిపడుతున్నారు. దరఖాస్తుల స్క్రూటినీ ప్రక్రియ అంతా గోప్యంగా నిర్వహించి సర్క్యులేషన్ లేని పత్రికలకు సైతం కార్డులు కేటాయించడం వెనుక భారీగా చేతులు మారినట్లు పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

కలెక్టర్ గారు.. దృష్టి సారించండి..!

జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి, ఈ అక్రిడేషన్ల జారీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని పలువురు జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు.

జిల్లా అధికారులపై సమాచార శాఖ కమీషనర్‌కు ఫిర్యాదు..

కాకినాడ జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ (I&PR) అధికారుల తీరుపై రాష్ట్ర సమాచార శాఖ కమీషనర్‌కు అధికారికంగా ఫిర్యాదు అందింది. జిల్లాలో మీడియా అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని, అర్హత లేని వ్యక్తులకు నిబంధనలకు విరుద్ధంగా కార్డులు మంజూరు చేశారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో జర్నలిస్టులుగా పనిచేయని వారికి, ఎలాంటి అర్హత, అనుభవం లేని వారికి అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసినట్లు ఆరోపించారు. దరఖాస్తుల పరిశీలనలో జిల్లా అధికారులు కనీస నిబంధనలు పాటించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని, ప్రస్తుత దరఖాస్తులను మళ్లీ క్షుణ్ణంగా పరిశీలించాలని, కేవలం నిబంధనల ప్రకారం అర్హత కలిగిన జర్నలిస్టులకు కార్డులు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ​ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి, అనర్హులకు సహకరించిన కాకినాడ జిల్లా సమాచార శాఖ అధికారులపై తక్షణమే విచారణ చేపట్టి, కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కమీషనర్‌ను కోరారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us