UPDATED 2nd JULY 2026 9:00 PM
ఆరు రోజుల నిరీక్షణకు తెర
అందుబాటులోకి ఏపీ పోలీస్ వెబ్‌సైట్
సాంకేతిక లోపాలను అధిగమించిన ఐటీ విభాగం
యుద్ధప్రతిపాదికన సర్వర్ల పునరుద్ధరణ
యథావిధిగా ఆన్‌లైన్ సేవలు
అమరావతి, రెడ్ బీ న్యూస్, జూలై 2 : గత ఆరు రోజులుగా సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారిక వెబ్‌సైట్ ఎట్టకేలకు పునరుద్ధరించబడింది. ఈ ఉదంతంపై ఉన్నతాధికారులు వేగంగా స్పందించారు. దీనిపై రెడ్ బీ న్యూస్ లో కథనం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. సాంకేతిక లోపాలను పూర్తిగా అధిగమించి, ప్రస్తుతం వెబ్‌సైట్‌ను ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వెబ్‌సైట్ డౌన్ అవ్వడం వల్ల సామాన్య ప్రజలకు కలిగిన ఇబ్బందులను గమనించిన పోలీస్ సాంకేతిక విభాగం, యుద్ధప్రతిపాదికన పనిచేసి సర్వర్లను పునరుద్ధరించిందని పేర్కొన్నారు.
సాంకేతిక సమస్య వల్లే అంతరాయం
ప్రభుత్వ డిజిటల్ సేవల ఆధునీకరణలో భాగంగా సర్వర్ల అప్‌గ్రేడేషన్ ప్రక్రియ చేపట్టామని, ఆ సమయంలో కొన్ని ఊహించని సాంకేతిక లోపాల (Technical Glitches) వల్లే ఈ అంతరాయం ఏర్పడిందని ఐటీ నిపుణుల విభాగం స్పష్టం చేసింది. ప్రజల భద్రత, డేటా ప్రైవసీకి ఎటువంటి భంగం కలగకుండా ఉండేందుకు పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించామని, ఆ తర్వాతే వెబ్‌సైట్‌ను మళ్లీ లైవ్‌లోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
అధికారుల ప్రకటన
డిజిటల్ సేవల నిర్వహణలో భవిష్యత్తులో ఇలాంటి అంతరాయాలు కలగకుండా బ్యాకప్ సర్వర్లను, పటిష్టమైన సాంకేతిక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాము. ప్రజలు ఎప్పటిలాగే ఆన్‌లైన్ పోలీస్ సేవలను ఎలాంటి ఆటంకం లేకుండా వినియోగించుకోవచ్చు."డిజిటల్ విప్లవంలో భాగంగా ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని, వ్యవస్థల సమర్థవంతమైన నిర్వహణకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.







