TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?

UPDATED 4th SEPTEMBER 2026 10:00 AM

న్యూఢిల్లీ, రెడ్ బీ న్యూస్, సెప్టెంబర్ 4: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ 'వాట్సాప్' భారత్‌లో విద్యుత్, గ్యాస్, ఫాస్టాగ్ తదితర బిల్లుల చెల్లింపుల కోసం 'బిల్ పేమెంట్' సేవలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. భారత్ కనెక్ట్ నెట్‌వర్క్ సహకారంతో మెటా యాజమాన్యం తీసుకొచ్చిన ఈ నిర్ణయంపై డిజిటల్ చెల్లింపుల రంగంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది వినియోగదారులకు సౌలభ్యాన్ని అందిస్తుందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిలోని ప్రతికూల కోణాలపై ఆర్థిక, సాంకేతిక నిపుణులు పలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

గోప్యత, సైబర్ భద్రతకు పెను సవాలు

ప్రధానంగా సోషల్ నెట్‌వర్కింగ్, సందేశాల మార్పిడి కోసం ఉపయోగించే యాప్‌లో ఆర్థిక లావాదేవీల డేటా నమోదు కావడం వల్ల వినియోగదారుల ప్రైవసీకి భంగం వాటిల్లే ప్రమాదం ఉందనే వాదన బలపడుతోంది. ఒకవేళ ఖాతా చోరీకి గురైనా లేదా ఫోన్ అన్‌లాక్ అయి దుర్వినియోగమైనా సున్నితమైన ఆర్థిక సమాచారం ఇతరుల చేతికి చిక్కే అవకాశాలు ఉన్నాయని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రశ్నార్థకంగా మారనున్న కస్టమర్ సపోర్ట్

లావాదేవీలు విఫలమైనప్పుడు (ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్) లేదా ఖాతా నుంచి నగదు కట్ అయి బిల్లు అప్‌డేట్ కానప్పుడు తక్షణ పరిపరిష్కారం చూపే యంత్రాంగం వాట్సాప్‌లో ఏ మేరకు సమర్థవంతంగా పనిచేస్తుందనేది పెద్ద సందేహంగా మారింది. గూగుల్‌పే, ఫోన్‌పే వంటి సంస్థల మాదిరిగా వేగవంతమైన గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్, కస్టమర్ కేర్ నెట్‌వర్క్ లేకపోవడం వాట్సాప్‌కు పెద్ద లోపంగా మారే అవకాశం ఉంది.

దిగ్గజ యాప్‌ల పోటీని తట్టుకోవడం సులభం కాదు

ఇప్పటికే భారతీయ డిజిటల్ చెల్లింపుల మార్కెట్‌లో 80 శాతానికి పైగా వాటాను కైవసం చేసుకున్న ఫోన్‌పే, గూగుల్‌పేలను ఎదుర్కొని నిలబడటం వాట్సాప్‌కు సులభం కాకపోవచ్చు. వినియోగదారులను ఆకర్షించే క్యాష్‌బ్యాక్‌లు, రివార్డులు, స్క్రాచ్ కార్డ్స్ వంటి ప్రోత్సాహకాలు లేకపోవడం వాట్సాప్ కొత్త ఫీచర్ ఆదరణపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

యాప్ వినియోగంలో పెరగనున్న సంక్లిష్టత

కేవలం సందేశాల మార్పిడికి అనువుగా ఉండే యాప్‌ను వాణిజ్య లావాదేవీల కేంద్రంగా మార్చడం వల్ల యాప్ ఉపయోగం సంక్లిష్టంగా మారడంతో పాటు, అనవసరమైన నోటిఫికేషన్లతో వినియోగదారులకు అసౌకర్యం కలగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us