UPDATED 12th SEPTEMBER 2026 9:00 AM
– వైఖానస ఆగమ సంప్రదాయంలో శ్రీవేంకటేశ్వరునికి నిత్యం 45 రకాల నైవేద్యాలు
– ఆలయ పోటులో పవిత్రంగా సిద్ధమయ్యే 20 రకాల అన్న ప్రసాదాలు, 25 రకాల పణ్యారాలు
– మిరపకు బదులుగా నల్లమిరియాల వినియోగం… ప్రాచీన సంప్రదాయానికి నిదర్శనం
– మూడు పూటలా ప్రత్యేక కైంకర్యాలు… ఏకాంత సేవలో వెచ్చని పాల సమర్పణ
తిరుమల, రెడ్ బీ న్యూస్, సెప్టెంబర్ 12: ,తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతిరోజూ అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా జరిగే నైవేద్య కైంకర్యాలు ప్రాచీన వైదిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. నిత్యం స్వామివారికి వివిధ రకాల రుచికరమైన అన్నప్రసాదాలు, పిండి వంటలను వైఖానస ఆగమ సూత్రాల ప్రకారం సమర్పించడం సుదీర్ఘకాలంగా ఆనవాయితీగా వస్తోంది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో జరిగే పూజా సమయాలకు అనుగుణంగా ప్రత్యేక నైవేద్యాలను ఆలయ అర్చకులు స్వామికి నివేదిస్తారు.
ఆగమ సంప్రదాయాలు – నైవేద్యాల ప్రత్యేకత
శ్రీవారి ఆలయంలో ప్రసాదాల తయారీకి ప్రత్యేకమైన వైఖానస ఆగమ నిబంధనలు ఉన్నాయి. ఆలయ పోటు (పాకశాల)లో అత్యంత పవిత్రతతో, సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ ప్రసాదాలను సిద్ధం చేస్తారు. ఈ నైవేద్యాల తయారీలో ఎండుమిర్చి, పచ్చిమిర్చిలను అస్సలు ఉపయోగించకపోవడం ఒక విశిష్ట సంప్రదాయం. మిరపకు బదులుగా కేవలం నల్లమిరియాలనే వినియోగిస్తారు. వైఖానస పరిభాష ప్రకారం మనం పిలిచే పులిహోరను ‘తింత్రిణీరసాన్నం’ అని, నెయ్యి పొంగలిని ‘ముద్గాన్నం’, బెల్లం అన్నాన్ని ‘గుడాన్నం’, మిరియాల అన్నాన్ని ‘మరీచ్యాన్నం’, వడను ‘మాషాపూపం’, దోశను ‘చక్రప్పం’ అని వ్యవహరిస్తారు.
మొదటి గంట – ఉదయకాల నైవేద్యం
ప్రతిరోజూ ఉదయాన్నే ఆలయంలో మొదటి గంట మోగిన అనంతరం స్వామివారికి ప్రథమ నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈ సమయంలో మాత్రాన్నం, ముద్గాన్నం (నెయ్యి పొంగలి), తింత్రిణీరసాన్నం (పులిహోర), దధ్యోదనం (పెరుగన్నం), గుడాన్నం (చక్ర పొంగలి), శాకాన్నం (కదంబం), శర్కరాన్నం (రవ్వకేసరి) వంటి అన్నప్రసాదాలను స్వామికి నివేదిస్తారు. వీటితో పాటు లడుకం (లడ్డు), మాషాప్పం (వడ), గుడప్పం (అప్పం), చక్రప్పం (దోశ) అనే నాలుగు రకాల పణ్యారాలను కూడా అర్చకులు సమర్పిస్తారు.
రాజభోగం – మధ్యాహ్న సమర్పణ
ఉదయం పూజల అనంతరం మధ్యాహ్నం రెండో గంట సమయానికి శ్రీవారికి ‘రాజభోగం’ కైంకర్యం నిర్వహిస్తారు. రాజభోగంలో భాగంగా శుద్ధాన్నం (తెల్ల అన్నం), పులిహోర, గుడాన్నం, దధ్యోదనం, శీరా లేదా శక్కరభాత్ వంటి దివ్య ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా ఉంచుతారు. ఈ సమర్పణతో మధ్యాహ్న కాల ఆరాధన పూర్తవుతుంది.
శయనభోగం – రాత్రిపూట కైంకర్యాలు
సాయంత్రం గర్భాలయాన్ని శుద్ధి చేసి, స్వామివారిని తాజా దివ్య పుష్పాలతో అలంకరించిన తర్వాత రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు. మూడో గంట అనంతరం ‘శయనభోగం’ నైవేద్యాన్ని నిర్వహిస్తారు. ఈ సమయంలో మరీచ్యాన్నం (మిరియాల అన్నం), చక్రప్పం, లడుకం, మాషాప్పం, శర్కరాన్నం సమర్పిస్తారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో నిర్వహించే శయనభోగంలో భాగంగా తెల్ల అన్నం, బెల్లంతో చేసిన తీపి గుడాన్నంతో కూడిన ‘తిరువీసం’ అనే ప్రత్యేక నైవేద్యాన్ని స్వామికి నివేదిస్తారు. చివరిగా ఏకాంత సేవలో వెచ్చని పాలు, ఎండు ఫలాలు, రుచికరమైన పండ్ల ముక్కలను సమర్పించడంతో ఆ రోజు నైవేద్య కైంకర్యాలు ముగుస్తాయి.







