UPDATED 5th SEPTEMBER 2026 8:00 AM
పెద్దవడుగూరు, రెడ్ బీ న్యూస్ , సెప్టెంబర్ 5: అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు సమీపంలో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇంటర్ సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే ప్రయాణికురాలి సమయస్ఫూర్తి, డ్రైవర్ అప్రమత్తతతో 33 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రాణనష్టం తప్పింది.
గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బస్సు మిడుతూరు పెట్రోల్ బంక్ సమీపానికి చేరుకుంది. బస్సులోని ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా వెనుకవైపు నుంచి మంటలు రావడాన్ని నేహా అనే ప్రయాణికురాలు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై కేకలు వేస్తూ డ్రైవర్ ను హెచ్చరించారు. దీంతో డ్రైవర్ చాకచక్యంగా బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. ప్రయాణికులంతా హుటాహుటిన కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది.
కళ్లముందే బస్సు పూర్తిగా కాలి బూడిదవ్వడంతో ప్రయాణికుల ల్యాప్ టాప్ లు, సెల్ ఫోన్లు, విలువైన లగేజీ అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలాన్ని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు. చిక్కుకుపోయిన ప్రయాణికులను పోలీసులు ప్రత్యామ్నాయ వాహనాల్లో హైదరాబాద్ కు తరలించారు.







