UPDATED 7th JULY 2026 9:30 PM
ఆన్‌లైన్ మోసగాడి చేతిలో రూ. 2.60 లక్షలు పోగొట్టుకున్న నిర్వాహకుడు
నకిలీ ఇన్‌వాయిస్‌లు, బిల్లులతో నమ్మించి ముంచేసిన గుజరాత్ కేటుగాడు
కేసు నమోదు చేసిన పోలీసులు
పెద్దాపురం, రెడ్ బీ న్యూస్, జూలై 7 : ఆన్‌లైన్ వ్యాపారాల పేరుతో జరుగుతున్న మోసాలకు అమాయక యువత, వ్యాపారులు బలైపోతున్నారు. తక్కువ ధరకే పౌల్ట్రీ మేత సరఫరా చేస్తామంటూ నమ్మబలికిన ఓ సైబర్ కేటుగాడు పెద్దాపురం మండలానికి చెందిన ఒక పౌల్ట్రీ నిర్వాహకుడిని రూ. 2.60 లక్షలకు ముంచేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కధనం ప్రకారం పెద్దాపురం మండలం జె.తిమ్మాపురం గ్రామానికి చెందిన ఇమ్మిణ్ణి జానకిరామ్ (19) అనే పౌల్ట్రీ నిర్వాహకుడు తన కుటుంబంతో కలిసి గ్రామంలో ‘వెంకట దుర్గా పౌల్ట్రీ ఫాం’ నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఆ యువకుడి తండ్రి ప్రమాదానికి గురికావడంతో పౌల్ట్రీ బాధ్యతలను జానకిరామ్ చూసుకుంటున్నాడు. పౌల్ట్రీ మేత కొరకు ‘ExportersIndia.com’ అనే వెబ్‌సైట్ ద్వారా గుజరాత్‌కు చెందిన ‘జినాల్ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్’ (Jinal Global Exports) కంపెనీ ప్రతినిధులు ఇతనికి పరిచయమయ్యారు.
నమ్మించి అడ్వాన్స్‌లు వసూలు
తానే ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ (MD) ప్రతాప్ ఠాకూర్ అని పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి, పౌల్ట్రీ మేతకు ఉపయోగించే 25 టన్నుల మొక్కజొన్నను రూ. 5 లక్షలకు సరఫరా చేస్తానని జానకిరామ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. సరుకు డెలివరీ కావడానికి ముందే సగం సొమ్ము అడ్వాన్స్‌గా చెల్లించాలని కోరగా, బాధితుడు విడతల వారీగా జూన్ 14 నుంచి జూన్ 19 మధ్య కాలంలో తన హెచ్‌డిఎఫ్‌సి (HDFC) బ్యాంక్ ఖాతాల నుంచి సదరు నిందితుడు పంపిన యూనియన్ బ్యాంక్ ఖాతాకు మొత్తం రూ. 2,60,000/- బదిలీ చేశాడు.
నకిలీ బిల్లులతో నమ్మబలికి.. ఫోన్ స్విచ్ఛాఫ్!
డబ్బులు అందిన వెంటనే నిందితుడు ప్రతాప్ ఠాకూర్ నమ్మకం కలిగించేలా నకిలీ ఇన్‌వాయిస్, లారీ బిల్లు, ఈ-వే బిల్లులను (E-way bill) బాధితుడి వాట్సాప్ నెంబర్‌కు పంపించాడు. మూడు రోజుల్లో లారీ మీ గ్రామానికి వస్తుందని నమ్మబలికాడు. అయితే రోజులు గడుస్తున్నా సరుకు రాకపోవడం, ఎన్నిసార్లు ఫోన్ చేసినా అవతలి వ్యక్తి నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో బాధితుడు తాను మోసపోయానని గ్రహించాడు.
పోలీసుల రంగప్రవేశం – ఐటీ చట్టం కింద కేసు నమోదు
దీంతో బాధిత యువకుడు జానకిరామ్ పెద్దాపురం పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన పెద్దాపురం ఎస్.ఐ యు. పాపారావు జూలై 6వ తేదీ మధ్యాహ్నం నిందితుడు ప్రతాప్ ఠాకూర్ (జినాల్ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్ MD) పై బిఎన్ఎస్ (BNS) సెక్షన్ 318(4) (ఛీటింగ్), ఐటీ చట్టం (IT Act) సెక్షన్ 66(D) కింద క్రైమ్ నెంబర్ 165/2026 తో కేసు నమోదు చేశారు. ఈ ఆన్‌లైన్ మోసంపై పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో తెలియని వ్యక్తులతో వ్యాపార లావాదేవీలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా ప్రజలను హెచ్చరిస్తున్నారు.







