UPDATES 26th JUNE 2026 7:00 AM
* గరిష్ఠంగా 35 కిలోల పరిమితి యథాతథం
* జాతీయ ఆహార భద్రత చట్టం సవరణకు కేంద్రం కసరత్తు..
* జూలై 13 వరకు ప్రజాభిప్రాయ సేకరణ
న్యూఢిల్లీ, రెడ్ బీ న్యూస్, జూన్ 26 : దేశంలోని నిరుపేదలకు ఆహార ధాన్యాలను అందజేసే ‘అంత్యోదయ అన్న యోజన (AAY)’ పథకంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేయబోతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా ఈ పథకం కింద లబ్ధిదారులకు ఇకపై ఒక్కొక్కరికీ 7 కిలోల చొప్పున బియ్యం లేదా గోధుమలను పంపిణీ చేసేలా కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసింది.
ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం.. అంత్యోదయ కార్డు ఉన్న నిరుపేద కుటుంబాలకు సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా నెలకు 35 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తున్నారు. అయితే, కేంద్రం తీసుకురానున్న కొత్త మార్పుల వల్ల ఇకపై ప్రతి వ్యక్తిని ప్రామాణికంగా తీసుకోనున్నారు.
కొత్త విధానం ఎలా ఉండబోతోందంటే..?
ప్రభుత్వ వాదన: జాతీయ ఆహార భద్రత చట్టం-2013 ప్రకారం.. ప్రతి వ్యక్తికీ తగిన పరిమాణంలో ఆహార ధాన్యాలు అందేలా చేయడమే ఈ సవరణ యొక్క ముఖ్య ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
ఈ మార్పులకు సంబంధించి జాతీయ ఆహార భద్రత చట్టాన్ని సవరించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. దీనిపై జూలై 13 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలను సేకరించనుంది. ఆ తర్వాతే ఈ నూతన విధానంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
తక్కువ మంది ఉంటే కోత
కొత్త విధానం అమల్లోకి వస్తే, అంత్యోదయ కార్డు ఉన్న కుటుంబంలో కేవలం ఇద్దరే సభ్యులు ఉంటే వారికి నెలకు 14 కిలోలు మాత్రమే లభిస్తాయి. ముగ్గురు ఉంటే 21 కిలోలు, నలుగురు ఉంటే 28 కిలోల చొప్పున రేషన్ అందుతుంది. కుటుంబంలో సభ్యుల సంఖ్య ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్నప్పటికీ.. గరిష్ఠ పరిమితి అయిన 35 కిలోలను మాత్రమే అందిస్తారు. అంతకంటే అదనంగా ఇచ్చే అవకాశం లేదు.







