VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!

UPDATED 4th AUGUST 2026 3:00 PM

దొంగిలించిన ఇంట్లోనే సొత్తు పడేసి, క్షమాపణ లేఖ రాసిన వైనం

కరప, రెడ్ బీ న్యూస్, ఆగష్టు 4 : దొంగతనం చేయడం ఒక ఎత్తయితే... పోలీసుల భయంతో దొంగిలించిన సొత్తును తిరిగి బాధితుల ఇంట్లోనే విసిరేసి, క్షమాపణ లేఖ రాసి చివరకు పోలీసులకు చిక్కిన వింత సంఘటన కాకినాడ జిల్లా కరప మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

​ఘటన వివరాలు:

​కరప శివారు రామకంచిరాజునగర్ కాలనీకి చెందిన నామాల గణేశ్ కుటుంబ సభ్యులు వ్యాపార రీత్యా ఊళ్లు తిరుగుతుంటారు. జూన్ 23న తిరుపతి వెళ్లిన ఆయన కుటుంబం, జూలై 18న తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. సుమారు ₹6.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ₹58 వేల నగదు చోరీకి గురైనట్లు బాధితుడు కరప పోలీసులకు ఫిర్యాదు చేశారు.

​విచారణ భయంతో విచిత్ర నిర్ణయం:

​పోలీసుల విచారణ తీవ్రతరం కావడంతో, చోరీకి పాల్పడిన స్థానిక ముగ్గురు యువకులు (వీరిలో ఇద్దరు మైనర్లు) తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎలాగైనా దొరికిపోతామని భావించిన నిందితులు శనివారం అర్ధరాత్రి వేళ, దొంగిలించిన బంగారాన్ని ఒక పర్సులో పెట్టి తిరిగి గణేశ్ ఇంట్లోనే విసిరేశారు.

​పర్సులో బంగారంతో పాటు ఒక లేఖను కూడా ఉంచారు. అందులో “మేము చేసిన తప్పును క్షమించండి. చోరీ చేసిన నగదులో ₹22 వేలు వాడేసుకున్నాం, వాటిని తిరిగి ఇవ్వలేము” అని రాశారు.

​పంచాయతీ నిర్వహణ – నిందితుల అరెస్ట్:

​ఆదివారం ఉదయం సదరు పర్సు, లేఖను చూసిన బాధితులు కాలనీ పెద్దలను ఆశ్రయించారు. లేఖలోని వివరాల ఆధారంగా ఇది స్థానికుల పనేనని గ్రహించిన పెద్దలు కాలనీ పంచాయతీ ఏర్పాటు చేశారు. తప్పు ఒప్పుకుంటే మినహాయింపు ఇస్తామని, లేదంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించడంతో, ఆ ముగ్గురు యువకులు ఆదివారం రాత్రి పెద్దలకు ఫోన్ చేసి నేరాన్ని అంగీకరించారు.

​సోమవారం ఉదయం నిందితులను పంచాయతీ వద్ద విచారిస్తుండగా, సమాచారం అందుకున్న కరప పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి మిగిలిన బంగారు ఉంగరం, చెవిదిద్దుల జత, వెండి లాకెట్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us