UPDATED 25th 2026 JUNE 5:00 PM
- సాధారణ వ్యక్తిలా ప్రజలతో కలిసి భోజనం చేసిన ఆర్డీవో
- భోజనం నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక పరిశీలన..
- మున్సిపల్ కమిషనర్‌కు పలు సూచనలు
సామర్లకోట, రెడ్ బీ న్యూస్, జూన్ 25 : సామర్లకోట పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) పి. కృష్ణమూర్తి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాధారణ వ్యక్తిలా క్యాంటీన్‌కు వచ్చి ప్రజలతో కలిసి ఆయన కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా భోజనం నాణ్యత, రుచి, అలాగే క్యాంటీన్ పరిసరాల పరిశుభ్రత ప్రమాణాలను ఆయన స్వయంగా పరిశీలించారు.
ప్రజలతో ముఖాముఖి.. సేవలపై ఆరా
భోజనం చేస్తున్న సమయంలో క్యాంటీన్‌కు వచ్చిన పలువురు వినియోగదారులతో ఆర్డీవో ముఖాముఖి మాట్లాడారు. ప్రతిరోజూ అందుతున్న సేవల తీరును, భోజనం నాణ్యతపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్ నిర్వహణ పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయగా, పేదలకు నాణ్యమైన భోజనం అందించడమే ప్రభుత్వ ఆశయమని ఆయన పేర్కొన్నారు.
నిర్వహణ మెరుగుదలపై అధికారులకు ఆదేశాలు
అనంతరం క్యాంటీన్ వంటగదిని, నిల్వ ఉంచిన సరుకులను ఆర్డీవో కృష్ణమూర్తి క్షుణ్ణంగా పరిశీలించారు. క్యాంటీన్ నిర్వహణను మరింత సమర్థవంతంగా సాగించేందుకు, పేదలకు సేవల మెరుగుదలపై అక్కడే ఉన్న మున్సిపల్ కమిషనర్‌కు పలు కీలక సూచనలు చేశారు. నిరుపేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.







