UPDATED 24 MAY 2026 9:10 AM
బాపట్ల, రెడ్ బీ న్యూస్, మే 24 :దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ‘పాస్టర్ చింతాడ ఆనంద్ కుల ధృవీకరణ పత్రం’ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఆధారంగా ఆయనకు ఉన్న ఎస్సీ (షెడ్యూల్డ్ కులం) హోదాను రద్దు చేస్తున్నట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. ఈ పరిణామం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వివాదం నేపథ్యం.. కోర్టుకెక్కిన వ్యవహారం
గతంలో జరిగిన ఒక వివాదంలో పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కారంటూ, ఆయన క్రైస్తవ మతాన్ని స్వీకరించి పాస్టర్‌గా కొనసాగుతున్నారని అక్కల రామిరెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఇటీవల కీలక తీర్పును వెలువరించింది.
సుప్రీంకోర్టు తీర్పులో కీలకాంశాలు:
కలెక్టర్ తుది నిర్ణయం:
సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టారు. ఆనంద్ మతం మారిన విషయాన్ని అధికారులు పూర్తిస్థాయిలో నిర్ధారించుకోవడంతో, ఆయనకున్న ఎస్సీ సర్టిఫికేట్‌ను రద్దు చేస్తూ కలెక్టర్ తుది ఉత్తర్వులు జారీ చేశారు.
దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన కేసు
మతం మారిన దళితులకు రిజర్వేషన్ల వర్తింపుపై దేశంలో ఎప్పటినుంచో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో పాస్టర్ చింతాడ ఆనంద్ కేసుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, తదనంతరం బాపట్ల కలెక్టర్ తీసుకున్న చర్య ఒక కీలక మైలురాయిగా మారనున్నాయి. మతం మారిన తర్వాత కూడా ఎస్సీ హోదాను వినియోగించుకుంటున్న పలువురికి ఈ తీర్పు ఒక హెచ్చరిక లాంటిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
- హిందూ మతం వీడితే హోదా రద్దు: ఎస్సీ కులాల్లో జన్మించినప్పటికీ, హిందూ మతాన్ని వీడి ఇతర మతాల్లోకి మారితే రాజ్యాంగబద్ధంగా లభించే ఎస్సీ రిజర్వేషన్ల హోదా వర్తించదని ధర్మాసనం స్పష్టం చేసింది.
- మతమార్పిడి ఆధారాలు: చింతాడ ఆనంద్ క్రైస్తవ మతంలోకి మారినట్లు బలమైన ఆధారాలు ఉండటంతో, ఆయనను ‘క్రిస్టియన్’గానే గుర్తిస్తూ ఎస్సీ హోదాను సుప్రీంకోర్టు రద్దు చేసింది.







