UPDATED 16th JUNE 2026 10:00 PM
ఈవో గైర్హాజరుపై గ్రామస్తుల ఆగ్రహం
పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవోలను చుట్టుముట్టిన జనం
రంగంలోకి పోలీసులు.. ఆర్డీవో 'స్ట్రాంగ్' హామీతో శాంతించిన ప్రజలు
పెద్దాపురం, రెడ్ బీ న్యూస్, జూన్ 16: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కేశవ, పట్టాభి రామస్వామివారి దేవస్థానం నిధుల అవకతవకల వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఆలయ నిధులు, భూముల పరిపాలనలో జరుగుతున్న పలు అక్రమాలపై మంగళవారం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశం తీవ్ర రసాభాసగా మారింది. ఇప్పటికే గ్రామస్తులు, భక్తులు ఈ అక్రమాలపై ఉన్నతాధికారులకు విడివిడిగా ఫిర్యాదులు చేయగా, తాజాగా నిర్వహించిన ఈ సభ ఉద్రిక్తతలకు దారితీసింది.
అధికారుల బాధ్యతారాహిత్యం.. జనం ఆగ్రహం!
దేవస్థానం నిధులు, భూముల వ్యవహారంలో జరిగిన అక్రమాలపై సమాధానం చెప్పాల్సిన దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) కాట్నం జగన్మోహన శ్రీనివాస్ ఈ సమావేశానికి గైర్హాజరు కావడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి సభకు ఎందుకు రాలేదని అక్కడున్న పంచాయతీ కార్యదర్శి మజ్జి శ్రీనివాసరావును గ్రామస్తులు గట్టిగా నిలదీశారు. అయితే, "దేవస్థానం వ్యవహారాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు" అని కార్యదర్శి సమాధానం ఇవ్వడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
దీంతో స్థానిక ఎంపీడీవో ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలని గ్రామస్తులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న ఎంపీడీవో కె.వి. సూర్యనారాయణ సైతం ఈ విషయంలో తమ శాఖకు సంబంధం లేదని చెప్పడంతో జనం మరింతగా మండిపోయారు. ఉన్నతాధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తాము కదిలే ప్రసక్తి లేదని గ్రామస్తులు భీష్మించుకు కూర్చున్నారు.
ఈవో పనితీరుపై ఆర్డీవో తీవ్ర ఆగ్రహం.. రికార్డులతో హాజరుకావాలని ఆర్డర్!
పరిస్థితి చేతులు దాటుతోందని గమనించిన ఆర్డీవో పి. కృష్ణమూర్తి, తహశీల్దార్ పి. శ్రీనివాస్ హుటాహుటిన కట్టమూరు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రజల ఆగ్రహానికి ముఖ్య కారణమైన ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ బాధ్యతారహిత్య వైఖరి, పనితీరుపై ఆర్డీవో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల అవకతవకలపై సమాధానం చెప్పకుండా సభకు రాకుండా తప్పించుకోవడంపై మండిపడ్డారు.
ఆర్డీవో వార్నింగ్: గ్రామస్తుల సమక్షంలోనే ఈవోకు ఆర్డీవో ఫోన్ చేసి ఆయన పనితీరును తీవ్రంగా తప్పుబడుతూ "స్ట్రాంగ్ వార్నింగ్" ఇచ్చారు. దేవస్థానం నిధుల దుర్వినియోగానికి సంబంధించిన పూర్తి రికార్డులతో తక్షణమే తమ కార్యాలయానికి హాజరు కావాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలయ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపిస్తామని ఆర్డీవో గ్రామస్తులకు గట్టి హామీ ఇవ్వడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.
పోలీసుల వైఖరిపై హిందూ సంఘాల ఆగ్రహం!
మరోవైపు శాంతిభద్రతల పరిరక్షణ కోసం వచ్చిన పోలీసుల వైఖరిపై గ్రామస్తులు, హిందూ సంఘాల నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న సీఐ వై.ఆర్.కె శ్రీనివాస్‌ను హిందూ సంఘాల నేతలు నిలదీశారు. తాము ఉన్నతాధికారుల అనుమతులతోనే ఈ సభను నిర్వహిస్తున్నామని, అక్రమార్కులకు కొమ్ముకాయవద్దని డిమాండ్ చేశారు. కేశవ పట్టాభి రామస్వామి దేవస్థానం నిధులు, భూముల అవకతవకల వ్యవహారం పూర్తిగా తేలేవరకు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు తాము వెనక్కి తగ్గేదే లేదని వారు స్పష్టం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.







