UPDATED 3rd AUGUST 2026 6:00 AM
శ్రీవారి సన్నిధిలో అంగరంగ వైభవంగా విష్ణు సహస్రనామ పారాయణం
స్వామివారి ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించిన టీటీడీ
మండపేట, రెడ్ బీ న్యూస్, ఆగష్టు 3: తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం గ్రామానికి చెందిన ఆధ్యాత్మిక చైతన్య మూర్తులు తిరుమల గిరులలో భక్తి పారవశ్యాన్ని నింపారు. తాపేశ్వరం గ్రామం నుంచి సుమారు 40 మంది సభ్యులతో కూడిన శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ బృందం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిధికి చేరుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
ఏడుకొండలలో మార్మోగిన విష్ణు నామస్మరణ
తిరుమల క్షేత్రంలో అడుగుపెట్టిన ఈ భక్తబృందం, సప్తగిరులు పులకరించేలా శ్రీ మహానిష్ణువు దివ్య నామాలను అత్యంత నిష్టతో పారాయణం చేశారు. భక్తి భావంతో సాగిన ఈ విష్ణు సహస్రనామ పారాయణంతో తిరుమల పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభతో విలసిల్లాయి. పారాయణానంతరం భక్తులంతా స్వామివారి నామస్మరణతో భక్తి పారవశ్యంలో మునిగితేలారు.
ప్రత్యేక దర్శనం.. స్వామివారి కృపాకటాక్షాలు
పారాయణ కార్యక్రమం అనంతరం భక్తబృందం ఆనంద నిలయానికి చేరుకుని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారిని కనులారా దర్శించుకుని తరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఈ భక్తబృందానికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు గావించారు. స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని, ఆయన కృపాకటాక్షాలు పొందినట్లు తాపేశ్వరం భక్తబృందం ప్రతినిధులు పరమానందంతో తెలిపారు.







