UPDATED 20 MAY 2026 7:10 AM
* క్రైస్తవ ప్రచారకుడి ముసుగులో అభినయ్ దర్శన్ ఘాతుకం
* మతోన్మాదుల దాడి అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం
* వాట్సాప్ ఆడియో సాక్ష్యంతో గుట్టురట్టు చేసిన విశాఖ పోలీసులు
విశాఖపట్నం, రెడ్ బీ న్యూస్, మే 20 : గిరిజన ప్రాంతంలో క్రైస్తవ మత ప్రచారకుడిగా, ‘భరోసా’ పార్టీ అధినేతగా చలామణి అవుతున్న అభినయ్ దర్శన్ ఆడిన హైడ్రామా చివరకు అభాసుపాలైంది. ఏజెన్సీ ప్రాంతంలో క్రైస్తవులు, గిరిజనుల నుంచి రాజకీయ లబ్ధి, సానుభూతి పొందడమే లక్ష్యంగా తనపై తానే దాడి చేయించుకున్న వైనాన్ని విశాఖపట్నం పోలీసులు శాస్త్రీయ ఆధారాలతో సహా బట్టబయలు చేశారు.
బెదిరింపుల నుంచి 'హత్యాయత్నం' దాకా..
కడప నగరానికి చెందిన అభినయ్ దర్శన్ ఈ ఏడాది జనవరిలో అరకు లోయలో క్రైస్తవులతో కలిసి పాదయాత్ర ప్రారంభించారు. ఆ తర్వాత మార్చిలో కాకినాడ కేంద్రంగా ‘భరోసా’ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. గత నెల రోజులుగా పాడేరు నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన, గత 16 రోజులుగా గూడెంకొత్తవీధి మండలం, మొండిగెడ్డ పంచాయతీ పరిధిలోని నీరుతోటపాలెంలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే, తనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఏజెన్సీ విడిచి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారంటూ 10 రోజుల క్రితం ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత, సోమవారం నాడు గ్రామం నుంచి కారులో జర్రెల వైపు వెళ్తుండగా కొందరు దుండగులు తనను అడ్డగించి 'హత్యాయత్నం' చేశారంటూ నాటకానికి తెరతీశారు. అనంతరం చింతపల్లి ఆస్పత్రిలో చేరి హల్‌చల్ సృష్టించారు.
సోషల్ మీడియాలో 'విక్టిమ్ కార్డ్'
దాడి జరిగిన వెంటనే అభినయ్ అనుచరులు ఆ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. ‘భరోసా పార్టీ అధినేత అభినయ్‌పై మతోన్మాదుల దాడి’ అంటూ క్రైస్తవ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపేలా ప్రచారం సాగించారు. ఉద్రిక్తతలకు దారితీసేలా ఉన్న ఈ ఘటనను పోలీసులు అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు.
వాట్సాప్ ఆడియోతో దొరికిపోయిన సూత్రధారి
చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా పర్యవేక్షణలో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలను, అభినయ్ మొబైల్ డేటాను విశ్లేషించారు. తొలుత గుర్తుతెలియని వ్యక్తుల దాడి అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించినప్పటికీ, అభినయ్ అనుచరులను విచారించడంతో అసలు నిజం బయటపడింది.
పోలీసుల దర్యాప్తులో తేలిన కీలక అంశాలు:
నియామకం: తనపై దాడి జరిపేందుకు అభినయ్ ముగ్గురు వ్యక్తులను ప్రత్యేకంగా పురమాయించుకున్నారు.
స్క్రిప్ట్ అండ్ ప్లానింగ్: ఏ సమయంలో, ఎక్కడ, ఏ విధంగా దాడి చేయాలనే పూర్తి సూచనలను అభినయ్ స్వయంగా వాట్సాప్ వాయిస్ మెసేజ్‌ల రూపంలో వారికి పంపించారు.
వీడియో షూట్: దాడి జరుగుతున్న సమయంలో కారులోనే ఉన్న అభినయ్ ముగ్గురు అనుచరులు దాన్ని మొబైల్‌లో చిత్రీకరించి, ముందస్తు ప్రణాళిక ప్రకారం ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు.
కేసు నమోదుకు పోలీసుల సిద్ధం
సానుభూతి రాజకీయాల కోసం సమాజంలో మతపరమైన ఉద్రిక్తతలు రచ్చగొట్టేలా డ్రామా ఆడిన అభినయ్ దర్శన్‌తో పాటు, ఈ కుట్రలో భాగస్వాములైన ఆయన అనుచరులపై కూడా కఠిన చట్టాల కింద కేసు నమోదు చేసేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. మత ప్రచారకుడి ముసుగులో జరిగిన ఈ పొలిటికల్ స్టంట్ స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.







