UPDATED 29th JULY 2026 9:30 PM
* రూ. లక్షల విలువైన చోరీ సొత్తు రికవరీ
* రామవరంలో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలు
* నిందితుడిపై BNS సెక్షన్ల కింద కేసు నమోదు
పెద్దాపురం, రెడ్ బీ న్యూస్, జూలై 29 : జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో వరుస ఇళ్ళ చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి సుమారు 83 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పెద్దాపురం సబ్ డివిజన్ పోలీసు అధికారి ABG తిలక్ తెలిపారు.
పెద్దాపురం సర్కిల్ ఇనస్పెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పెద్దాపురం సబ్ డివిజన్ పోలీసు అధికారి తిలక్ వివరాలు వెల్లడించారు.
రామవరం గ్రామానికి చెందిన నిందితుడు భీమవరపు బాబ్జి (35) అనే వ్యక్తి రామవరం గ్రామంలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పలు దొంగతనాలకు పాల్పడ్డాడని, అతడిని కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామం సమీపంలోని అమృత రెస్టారెంట్ ఎదురుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. నిందితుడి వద్ద నుంచి వివిధ కేసులకు సంబంధించి చట్టబద్ధంగా మధ్యవర్తుల సమక్షంలో మొత్తం 83 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని తెలిపారు.
నిందితుడిని జగ్గంపేట పోలీసు స్టేషన్ క్రైమ్ నెం. 179/2026 BNS సెక్షన్లు 331(4), 305(a) ప్రకారం కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు తెలిపారు.
ఈ కేసును వేగంగా ఛేదించి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న జగ్గంపేట సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి. తిరుపతిరావు, ఎస్ఐ టి. రఘునాథరావుతో పాటు దర్యాప్తు బృందంలోని పోలీసు సిబ్బందిని పెద్దాపురం సబ్ డివిజన్ పోలీసు అధికారి తిలక్ ప్రత్యేకంగా అభినందించారు.







