ALERT: నెల రోజులుగా నరకయాతన.. పట్టించుకోని పాలకులు!

UPDATED 12th JUNE 2026 2:00 PM

ద్వారపూడి - తాపేశ్వరం మార్గంలో 'ట్రాఫిక్' నరకం

నెల రోజులుగా సాగుతున్న కల్వర్టు పనులు..

పట్టించుకోని అధికారులు, పాలకులు

​స్కూళ్లు తెరవడంతో విద్యార్థులు, ఉద్యోగుల అవస్థలు..

నిరసన వ్యక్తం చేస్తున్న వాహనదారులు

మండపేట, రెడ్ బీ న్యూస్, జూన్ 12 : తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి - తాపేశ్వరం ప్రధాన రహదారిపై ప్రయాణించాలంటేనే వాహనదారులు వణికిపోతున్నారు. ఈ మార్గంలోని అర్తమూరు తూము (కల్వర్టు) వద్ద గత నెల రోజులుగా సాగుతున్న నిర్మాణ పనుల కారణంగా నిత్యం తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ద్వారపూడి నుంచి తాపేశ్వరం మీదుగా మండపేట వెళ్లే ఈ అత్యంత కీలకమైన రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారు.

గంటల తరబడి ట్రాఫిక్‌లోనే..

​ఇటీవలే పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో సమస్య మరింత జటిలంగా మారింది. ఉదయం, సాయంత్రం వేళల్లో స్కూల్ బస్సులు, ఆటోలు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నాయి. దీంతో చిన్నారి విద్యార్థులు, సమయానికి కార్యాలయాలకు చేరుకోవాల్సిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నప్పటికీ, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి కనీసం ఒక్క ట్రాఫిక్ పోలీస్ లేదా సిబ్బందిని కూడా కేటాయించకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

​నెల రోజులుగా ఈ ప్రాంతంలో ఇంతటి దారుణమైన పరిస్థితి ఉన్నా, స్థానిక పాలకులు కానీ, సంబంధిత శాఖల అధికారులు కానీ కనీసం ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. అధికారుల ఉదాసీనత మరియు కాంట్రాక్టర్ల నత్తనడక పనుల వల్లే ఈ దుస్థితి దాపురించిందని స్థానికులు, వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

​ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, యుద్ధప్రాతిపదికన ఈ కల్వర్టు పనులను పూర్తి చేయాలని, అలాగే పనులు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి తమ ఇబ్బందులను తొలగించాలని ఈ ప్రాంత ప్రజలు మరియు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us