UPDATED 20 MAY 2026 10:20 PM
అన్యమతస్థుల మనోభావాలను కించపరిచారంటూ ఫిర్యాదు
పెద్దాపురం, (రెడ్ బీ న్యూస్ ), మే 20: మతపరమైన మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ప్రముఖ హిందూ ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్‌పై పెద్దాపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 12వ తేదీ సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో పెద్దాపురం మెయిన్ రోడ్డులోని భక్తాంజనేయ స్వామి ఆలయం వద్ద రాధా మనోహర్ దాస్ ఒక ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో ఆయన అన్యమతస్థులను, వారి దైవాలను, విశ్వాసాలను ఉద్దేశించి తీవ్ర ఆక్షేపణీయ వ్యాఖ్యలు చేశారని, ఇతర మతాల ప్రార్థనా మందిరాలను తక్కువ చేసి మాట్లాడారని సదరు రిపోర్టులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అన్యమతస్థుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచేలా ఉన్నాయని పెద్దాపురం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వాసంశెట్టి శేషారావు ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పెద్దాపురం సబ్ ఇన్‌స్పెక్టర్ మౌనిక ఈ నెల 13న కేసు నమోదు చేశారు. రాధా మనోహర్ దాస్‌పై భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్ 299 (మత విశ్వాసాలను అవమానించడం ద్వారా మతపరమైన భావాలను ఉద్దేశపూర్వకంగా గాయపరచడం), సెక్షన్ 196 (1) (వివిధ వర్గాల మధ్య శతృత్వాన్ని ప్రోత్సహించడం) కింద క్రైమ్ నెంబర్ 106/2026 గా కేసు నమోదు చేశారు.







