UPDATED 28th JULY 2026 8:00 AM
అడ్డతీగల, రెడ్ బీ న్యూస్, జూలై 28 : రాత్రి చీకటిలో నింగిలోని తారలు మిలమిలా మెరుస్తుంటే, నేలపై బ్రహ్మ కమలాలు వికసించి ఆకాశానికి పోటీ పడ్డాయి. అడ్డతీగలలోని ప్రభుత్వ ఉద్యోగి నాగేశ్వరం ఇంట ఆదివారం రాత్రి అపూర్వ దృశ్యం చోటుచేసుకుంది. చాలా కాలం ఎదురుచూసిన తర్వాత, నాగేశ్వరరావు నాటిన బ్రహ్మ కమలం మొక్కకు ఒకేసారి 16 పువ్వులు పూసి, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి.
దేవతా పుష్పాలుగా భావించే బ్రహ్మ కమలాలు ఏడాదికి ఒక్కసారి మాత్రమే పూస్తాయి, అది కూడా రాత్రి పూట. ఉదయం అయ్యేసరికి అవి మొగ్గలుగా మారిపోతాయి. అందుకే, ఈ అరుదైన పుష్పాలను చూడాలంటే అదృష్టం ఉండాలనేది చాలా మంది నమ్మకం.
నాగేశ్వరం చాలా సంవత్సరాల క్రితం ఈ మొక్కను నాటారు. కానీ, అది పూలు పూయడం లేదు. అయితే, ఆదివారం రాత్రి ఆ మొక్క అద్భుతంగా వికసించింది. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 16 పువ్వులు పూసి, ఆ ప్రాంతమంతా సుగంధాన్ని వ్యాపింపజేశాయి.
ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు గ్రామస్తులు క్యూ కట్టారు. బ్రహ్మ కమలాలు వికసించిన ఈ దృశ్యం అందరినీ ఆకర్షించింది. శివుని ఆజ్ఞతోనే ఈ పవిత్ర పుష్పాలు వికసించాయని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. ఈ అపూర్వ దృశ్యం అడ్డతీగలలో ఒక పండుగ వాతావరణాన్ని తెచ్చింది.







