UPDATED 4 MAY 2026 9:10 PM
వంటకం అనుకున్నారు.. మృత్యువు అంచులకు వెళ్లారు!
సోషల్ మీడియా పిచ్చితో కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం.
కాకినాడ, రెడ్ బీ న్యూస్, మే 4 : మనం నిత్యం చూసే సోషల్ మీడియా వీడియోలు ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తాయని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఒక తప్పుడు వీడియోను నమ్మి, ఆరోగ్యానికి మంచిదని భావించిన ఆ కుటుంబం.. ఏకంగా ప్రాణాంతకమైన ఉమ్మెత్త పువ్వుతో కూర వండుకుని తిని చావు అంచుల్లోకి వెళ్లింది.
అసలేం జరిగింది?
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎర్రంపాలెంలో ఈ దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. బిక్కిన గంగాభవాని కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వంటకం వీడియోను చూశారు. ఉమ్మెత్త పువ్వులను ఆకుకూరల్లా వండుకుని తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ఆ వీడియో సారాంశం. అది నిజమని నమ్మిన వారు, సోమవారం నాడు ఉమ్మెత్త పువ్వులను సేకరించి పప్పులో వేసి ఘుమఘుమలాడే కూర వండారు. ఇంట్లోని నలుగురు సభ్యులు గంగాభవాని, ముత్యాల వీరలక్ష్మి, వీరబ్బాయి, జయలక్ష్మి—ఎంతో ఇష్టంగా ఆ భోజనాన్ని ఆరగించారు.
నిమిషాల్లోనే మారిన దృశ్యం..
భోజనం ముగించిన కొద్దిసేపటికే అసలు రంగు బయటపడింది. కడుపులో వికారం, తల తిరగడం మొదలై చూస్తుండగానే ఆ నలుగురూ తీవ్ర అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. స్థానికులు అప్రమత్తమై వెంటనే వారిని ఆసుపత్రికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం వారు చికిత్స పొందుతూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
వైద్యుల హెచ్చరిక: ఉమ్మెత్త అంటేనే విషం!
ఉమ్మెత్త పువ్వు సహజంగానే అత్యంత విషపూరితమైనది. దీనికి నిర్దిష్టమైన విరుగుడు అంటూ ఏమీ ఉండదు. మోతాదు మించితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మి ప్రయోగాలు చేయకండి." అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.







