ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : పంజాబ్ లో ప్రధాని మోదీకి ఎదురైన భద్రతా వైఫల్యాలపై జరుగుతున్న దర్యాప్తును నిలిపివేయాలంటూ కొద్దిరోజుల క్రితం న్యాయవాదులను బెదిరించిన సిఖ్ పర్ జస్టిస్ (ఎస్.ఎఫ్.జె) సంస్థ.. తాజాగా ఈ అంశంపై విచారణ చేస్తున్న కమిటీ చైర్మన్ ను సైతం బెదిరించింది. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఛైర్మన్ జస్టిస్ ఇందూమల్హోత్రాను బెదిరిస్తూ ఓ ఆడియోను విడుదల చేసింది. ప్రధాని భద్రతా లోపం కేసును విచారణ నిలిపివేయాలని, ఈ వ్యవహారానికి దూరంగా ఉండాలని కమిటీ చైర్మన్ ను బెదిరించినట్లు ఆడియోలో ఉంది. గతంలోనూ పలువురు సుప్రీంకోర్టు జడ్జిలకు కాల్స్ చేసి ఎస్.ఎఫ్.జె సంస్థ బెదిరింపులకు పాల్పడింది. ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యాలపై జరుగుతున్న దర్యాప్తును నిలిపివేయాలంటూ.. అమెరికా కేంద్రంగా పనిచేసే ఎస్.ఎఫ్.జె నుంచి అనేక ఫోన్ కాల్స్ వచ్చాయని సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం కొద్దిరోజుల క్రితం ధర్మాసనానికి నివేదించింది. మోదీ కాన్వాయ్ ను అడ్డగించింది తామేనని ఎస్.ఎఫ్.జె పేర్కొందంటూ.. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ ఘటనపై ఓ ఎన్జీఓ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరపవద్దని న్యాయమూర్తులనూ బెదిరించారని వివరించింది. విచారణ చేపడితే జాతీయ భద్రత, సమగ్రతను దెబ్బతీసే అత్యంత ప్రతికూల చర్యలు ఎదుర్కొంటారని భయపెట్టినట్లు పేర్కొన్నారు.'అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ ఆఫ్ సుప్రీంకోర్టు సభ్యులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ముందస్తుగా రికార్డు చేసిన బెదిరింపు కాల్స్ వచ్చాయి. జనవరి 10న ఉదయం 10.40 గంటలకు, మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ కాల్ చేశారు. హుస్సేనీవాలా మార్గంలోని ఫ్లైఓవర్ పై మోదీ కాన్వాయ్ ను అడ్డుకోవడం వెనక తమ హస్తం ఉందని ప్రకటించుకొంది. 1981 సిక్కు వ్యతిరేక అల్లర్లలో దోషులను శిక్షించడంలో సుప్రీంకోర్టు విఫలమైందని, వేలాది మంది సిక్కు రైతులు చనిపోయినా ఎవరూ నోరు మెదపలేదని ఆరోపించింది. అలాంటి న్యాయస్థానం దీనిపై విచారణ చేపట్టొద్దని ఫోన్ కాల్ లో హెచ్చరించారు' అని న్యాయవాదుల సంఘం ధర్మాసనానికి లేఖ రాసింది.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







