UPDATED 6th JUNE 2026 5:10 AM
రాయవరం, రెడ్ బీ న్యూస్, జూన్ 6 : ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాకలోని విజయదుర్గా పీఠాధిపతి ‘గాడ్’ (90) శుక్రవారం రాత్రి శివైక్యం చెందారు. గత కొంతకాలంగా వయోభారంతో ఉన్న ఆయన పీఠంలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన నిర్యాణ వార్త తెలియడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆధ్యాత్మిక శ్రేణులు, వేలాది మంది భక్తులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
54 ఏళ్ల ఆధ్యాత్మిక ప్రస్థానం
1936 జనవరి 19న జన్మించిన 'గాడ్', ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులై 1972 ఆగస్టు 18న వెదురుపాకలో 'విజయదుర్గా పీఠాన్ని' స్థాపించారు. నాటి నుండి సుమారు 54 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ భక్తులను సన్మార్గంలో నడిపించారు. 1989లో శృంగేరి జగద్గురువుల పీఠాధిపతుల కరకమలాల మీదుగా ఇక్కడ విజయదుర్గ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు.
దేశవిదేశాల్లో భక్తగణం
సాధారణ భక్తులతో పాటు దేశ, విదేశాల్లోనూ ఆయనకు భారీ సంఖ్యలో అనుచరులు, భక్తులు ఉన్నారు. తన ప్రవచనాలతో, సామాజిక సేవా కార్యక్రమాలతో పీఠాన్ని ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు. 'గాడ్' భౌతికకాయాన్ని దర్శించుకునేందుకు, చివరిసారిగా అంజలి ఘటించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు, ప్రముఖులు పెద్ద ఎత్తున వెదురుపాకకు తరలివస్తున్నారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.







