Dr. NTR Vydyaseva :సంక్షేమ ‘మిత్రల’కు... పథకాలేవి..!

UPDATED 18th JUNE 2026 3:00 PM 

​- వైద్యమిత్రల జీతాలకే పరిమితమైన సంక్షేమం

​- ‘అవుట్ సోర్సింగ్’ ముద్రతో ప్రభుత్వ పథకాలకు దూరం

​- అరకొర వేతనాలతో బతుకీడుస్తున్న వైనం.. ఆదుకోవాలని వినతులు

​అమరావతి, రెడ్ బీ న్యూస్, జూన్ 18: ఆసుపత్రిలోకి అడుగుపెట్టిన రోగికి ధైర్యం చెప్పి, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు అందేలా చూస్తూ, నిరంతరం ప్రజారోగ్య సేవల్లో మునిగితేలే ‘వైద్యమిత్ర’ల బతుకులు ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా మారాయి. వైద్యారోగ్య శాఖలో అవుట్ సోర్సింగ్ (పొరుగు సేవలు) పద్ధతిలో 2007 నుంచి పనిచేస్తున్న ఈ ఉద్యోగులకు అటు పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగుల హోదా రాక, ఇటు పేదలకు అందే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం "ప్రభుత్వ ఉద్యోగం" అనే రికార్డు ముద్ర వీరి కుటుంబాలను ఆర్థికంగా మరింత కుంగదీస్తోందనే ఆవేదన క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతోంది.

​సేవేమో ప్రభుత్వానిది.. లబ్ధేమో ప్రైవేటుదా?

​ ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆస్పత్రుల్లో  పనిచేసే వైద్యమిత్రలు, టీమ్ లీడర్లు రాత్రి పగలు అనక షిఫ్టుల వారీగా విధుల్లో ఉంటారు. అత్యవసర సమయాల్లో రోగులకు సేవలు అందిస్తారు. అయితే సాంకేతికంగా వీరు అవుట్ సోర్సింగ్ (APCOS / థర్డ్ పార్టీ) పరిధిలోకి వస్తారు. నెలకు వీరు అందుకునే అరకొర వేతనం కేవలం రూ.13 వేలే. నేటి కాలంలో ఈ జీతంతో ఇల్లు గడవడం, పిల్లల చదువులు సాగడం ఎంతో భారంగా మారింది. నిజానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు ₹10,000, పట్టణాల్లో ₹12,000 లోపు ఆదాయం ఉన్నవారే పేదరిక నిర్మూలనా పథకాలకు అర్హులు. వైద్యమిత్రల జీతం ఈ పరిమితి కంటే కేవలం ఒకట్రెండు వేల రూపాయలు ఎక్కువగా ఉండటంతో.. వీరు ఐటీ రిటన్స్ కట్టే ధనికుల తరహాలోనే ప్రభుత్వ రికార్డుల్లో చూపిస్తున్నారు. ఫలితంగా నిరుపేద కుటుంబాలకు చెందిన వీరు సంక్షేమ పథకాలకు పూర్తిగా దూరమవుతున్నారు.

​కోత పడుతున్న పథకాలు..

​రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న వందలాది మంది వైద్యమిత్రల కుటుంబాల్లో అర్హత ఉన్నప్పటికీ క్రింది పథకాలు వర్తించడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు: తల్లికి వందనం, సామాజిక భద్రత పింఛన్లు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ పథకాలు అందడం లేదు. పిల్లలను ఉన్నత చదువులు చదివించుకుందామంటే.. తల్లిదండ్రులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులనే కారణంతో ఈ విద్యా పథకాలకు కోత విధిస్తున్నారు. ఉచిత రేషన్ / బియ్యం కార్డులు జీతం పరిమితి దాటిందనే నెపంతో కొన్ని చోట్ల రేషన్ కార్డుల కేటగిరీలు మారిపోతున్నాయి. అలాగే ​ఇళ్ల స్థలాలు / గృహనిర్మాణం సొంత ఇల్లు లేని వైద్యమిత్రలకు ప్రభుత్వ గృహనిర్మాణ పథకాల్లో ప్రాధాన్యత దక్కడం లేదు.

​ఈఎస్ఐ, పీఎఫ్ ఉన్నా.. లోటు భర్తీ కాలేదుప్రభుత్వం వీరికి ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ, నిత్యావసరాల ధరలు పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో ఈ జీతాలు ఏమాత్రం సరిపోవడం లేదు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే ఇచ్చే ఎక్స్ గ్రేషియా వంటివి కూడా సున్నానే.. బతికి ఉన్నప్పుడు కుటుంబం గౌరవంగా బతకడానికి అవసరమైన సంక్షేమ సాయం అందకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది.

​ఆదాయ పరిమితి సడలించాలి: వైద్యమిత్రల డిమాండ్

"మేము చేసేది ప్రభుత్వ సేవ అయినప్పుడు, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పూర్తి వేతనాలు ఇవ్వాలి. లేదా కనీసం మా జీతాలను ప్రామాణికంగా తీసుకోకుండా, మా కుటుంబాల ఆర్థిక స్థితిని బట్టి సంక్షేమ పథకాలైనా వర్తింపజేయాలి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలి" అని ఆరోగ్య మిత్రల సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ​సంక్షేమ పథకాల అమలులో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను, ముఖ్యంగా 24 గంటలు ప్రజల ఆరోగ్యంతో ముడిపడి పనిచేసే వైద్యమిత్రలను ప్రత్యేక కేటగిరీగా గుర్తించి, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి వీరి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని క్షేత్రస్థాయి సిబ్బంది కోరుతున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us