GOLD LOAN SCAM: గోల్డ్ లోన్ టేకోవర్ పేరుతో తోటి ఉద్యోగులకే టోకరా!

UPDATED 11th JUNE 2026 9:00 AM

  • రూ. 24.58 లక్షలతో ఐపీఎల్/క్రికెట్ బెట్టింగ్..
  • టీమ్ లీడర్ ఘరానా మోసం
  • ​అనపర్తిలో కలకలం.. నిందితుడితో పాటు కుటుంబ సభ్యులపై కేసు నమోదు

అనపర్తి, రెడ్ బీ న్యూస్, జూన్ 11: నమ్మి బాధ్యతలు అప్పగించిన సహోద్యోగులను ఓ టీమ్ లీడర్ నట్టేట ముంచిన ఘటనా అనపర్తి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోల్డ్ లోన్ టేకోవర్ పేరుతో తోటి ఉద్యోగుల నుంచి ఏకంగా రూ. 24.58 లక్షలు వసూలు చేసి, ఆపై ఆ డబ్బు మొత్తాన్ని క్రికెట్ బెట్టింగ్‌లో తగలేసిన ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

కథనం ప్రకారం...

​అనపర్తిలోని కీర్తన బ్యాంక్‌లో జంపా వెంకట సుభాష్, వైరాల చిరంజీవి అనే ఇద్దరు యువకులు లోన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. వీరు స్థానిక వ్యాపారవేత్తలైన తేతల రాజశేఖర్ రెడ్డి, స్వామి శేఖర్ రెడ్డిల వద్ద నుండి వడ్డీకి నిధులు సమకూరుస్తూ గోల్డ్ లోన్ టేకోవర్ లావాదేవీలు నిర్వహిస్తుండేవారు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో కొక్కిరిమెట్ల వెంకట రామకృష్ణ అనే వ్యక్తి వీరికి టీమ్ లీడర్‌గా చేరాడు.

లాభాల ఎర.. లక్షల వసూలు

​రామచంద్రాపురంలోని ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్‌లో రూ. 24 లక్షల విలువైన గోల్డ్ లోన్ ఉందని, దానిని క్లియర్ చేసి తమ బ్యాంకుకు బదిలీ (టేకోవర్) చేస్తే భారీగా లాభాలు వస్తాయంటూ టీమ్ లీడర్ రామకృష్ణ నమ్మబలికాడు. ఉన్నతాధికారి మాటలను నిజమని నమ్మిన సుభాష్, చిరంజీవిలు తమకు తెలిసిన రుణదాతల ద్వారా విడతల వారీగా రూ. 24,58,000/- సమకూర్చి రామకృష్ణకు అందజేశారు.

క్రికెట్ బెట్టింగ్‌లో స్వాహా..

రోజులు గడుస్తున్నా లోన్ ప్రాసెస్ పూర్తికాకపోవడం, ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు ఒత్తిడి చేయడం ప్రారంభించారు. దీంతో రామకృష్ణ కేవలం రూ. 58 వేలు మాత్రమే తిరిగి ఇచ్చి, మిగతా మొత్తానికి కాలయాపన చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత కొద్దిరోజులకే అతను ఆఫీస్ నుండి పరారయ్యాడు. బాధితులు రామకృష్ణ బావమరిదిని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. తాను ఆ డబ్బు మొత్తాన్ని క్రికెట్ బెట్టింగ్‌లో ఓడిపోయానని, డబ్బు తిరిగి ఇచ్చే స్తోమత తనకు లేదని రామకృష్ణ స్వయంగా అంగీకరించాడు.

కుటుంబ సభ్యుల అండతో బెదిరింపులు..

​ఈ మోసం అంతా తన కుటుంబ సభ్యుల ప్లాన్ ప్రకారమే జరిగిందని రామకృష్ణ చెప్పడమే కాకుండా, బాధితులు నిలదీసేసరికి వారిపై బెదిరింపులకు దిగాడు. నిందితుడి కుటుంబ సభ్యులు కూడా బాధితులను తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేసి అక్కడి నుండి తరిమేశారు.

​ఉద్దేశపూర్వకంగానే తమను నమ్మించి, మోసం చేసి, డబ్బులు అక్రమంగా దుర్వినియోగం చేశారని బాధితుడు జంపా వెంకట సుభాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడు కొక్కిరిమెట్ల వెంకట రామకృష్ణతో పాటు అతని కుటుంబ సభ్యులపై అనపర్తి పోలీసులు కేసు (FIR) నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us