కోర్టు ఆదేశాలతో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు
UPDATED 24th AUGUST 2026 10:00 PM
పెద్దాపురం, రెడ్ బీ న్యూస్, ఆగష్టు 24 : అధిక లాభాలు ఇప్పిస్తామంటూ నమ్మించి ఏకంగా ఒక కోటి ఇరవై ఏడు లక్షలు రూపాయలు కాజేసిన భారీ ఆర్ధిక మోసం కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అధిక లాభాల పేరుతో బురిడీ కొట్టించిన నిందితులు
శ్రీ కనకమహాలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంకులో లేదా తమ వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి, కాకినాడ జిల్లా పెద్దాపురం నాగంపేటకు చెందిన జంపా నవదీప్ సంత్ నుంచి రూ. 1,27,00,000 (ఒక కోటి ఇరవై ఏడు లక్షలు) కాజేశారు. బాధితుడు విడతల వారీగా నిందితుల బ్యాంక్ ఖాతాలకు ఈ మొత్తాన్ని బదిలీ చేశాడు.
డబ్బులు తిరిగివ్వకపోగా చంపుతామని బెదిరింపులు
పెట్టుబడి బదిలీ చేసిన తర్వాత ఎలాంటి లాభాలు రాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు వారిని నిలదీశాడు. నిందితులు సరైన సమాధానం చెప్పకపోగా, తిరిగి డబ్బులు అడిగితే చంపేస్తామని బెదిరింపులకు దిగారు.
పోలీసులు స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించిన బాధితుడు
పోలీసు స్టేషన్‌తో పాటు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, బాధితుడు నవదీప్ సంత్ పెద్దాపురం అడిషనల్ జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు.
విశాఖ, ఖమ్మం ప్రాంతాలకు చెందిన ఏడుగురిపై కేసు నమోదు
కోర్టు ఆదేశాల మేరకు పెద్దాపురం ఎస్ఐ ఉంగటి పాపారావు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసులో నిందితులుగా ఉన్నవారి వివరాలు:
- విశాఖపట్నానికి చెందిన చీకటి పూర్ణచంద్రరావు
- చీకటి శరత్ కీర్తి
- కారుపర్తి మురళీధరరావు
- కారుపర్తి శ్రీదేవి
- జూపూడి రమేష్
- జూపూడి సృజన
- ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన చీకటి ఉమామహేశ్వరరావు
పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు
కోర్టు ఉత్తర్వుల ప్రకారం BNS 316(2), 316(5) r/w 3(5), 318(2), 318(4), BNNS 175(3) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంది. అయితే పోలీసులు మాత్రం కేవలం BNS 318(4), 351(2) r/w 3(5), BNNS 175(3) సెక్షన్లు మాత్రమే చేర్చి కేసు నమోదు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసుపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.







