UPDATED 7th JUNE 2026 8:10 AM
సిడ్నీ, రెడ్ బీ న్యూస్, జూన్ 7: ఆస్ట్రేలియా బయోసెక్యూరిటీ చరిత్రలోనే అత్యంత అరుదైన, భారీ ఆపరేషన్ ఒకటి వెలుగుచూసింది. దేశంలోకి దిగుమతి చేసుకోవడంపై పర్యావరణ చట్టాల ప్రకారం కఠిన నిషేధం ఉన్న లక్షకు పైగా విదేశీ బొద్దింకలను అధికారులు ఒకేచోట స్వాధీనం చేసుకున్నారు. ఆస్ట్రేలియా చరిత్రలో వెన్నెముక లేని జీవులకు (అకశేరుకాలు) సంబంధించి ఇంతపెద్ద ఎత్తున సీజ్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
బాథర్స్ట్‌లో గుట్టురట్టు..
న్యూసౌత్ వేల్స్ (NSW) రాష్ట్రంలోని బాథర్స్ట్ నగరంలో ఓ కమర్షియల్ బ్రీడర్ నివాసమే కేంద్రంగా ఈ అక్రమ వ్యాపారం సాగుతున్నట్లు అధికారులకు పక్కా సమాచారం అందింది. దీనిపై మే నెలలో ఆస్ట్రేలియా పర్యావరణ విభాగం అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో అక్కడ భారీ ఎత్తున నిల్వ ఉంచిన విదేశీ జాతి బొద్దింకలను చూసి అధికారులు సైతం అవాక్కయ్యారు.
ప్రమాదకరమైన 'మడగాస్కర్', 'డూబియా' జాతులు
ఈ ఆపరేషన్‌లో పట్టుబడిన జీవుల్లో అంతర్జాతీయంగా ప్రమాదకరమైన జాతులుగా గుర్తించిన ‘మడగాస్కర్ హిస్సింగ్’ (Madagascar Hissing), అలాగే ‘డూబియా’ (Dubia) రకాలకు చెందిన లక్షకు పైగా బొద్దింకలు ఉన్నట్లు పర్యావరణ విభాగం నిర్ధారించింది.
ఎందుకీ నిషేధం?
ఆస్ట్రేలియా పర్యావరణ సమతుల్యత చాలా సున్నితమైనది. ఇలాంటి విదేశీ కీటకాలు లేదా జీవులు స్థానిక వాతావరణంలోకి ప్రవేశిస్తే.. అవి ఇక్కడి జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తాయి. కొత్త రోగాలను వ్యాప్తి చేయడంతో పాటు, స్థానిక పంటలకు, వృక్షజాలానికి తీవ్ర నష్టం చేకూరుస్తాయి. అందుకే వీటి దిగుమతి, పెంపకంపై ఆస్ట్రేలియాలో కఠిన నిషేధాలు ఉన్నాయి.
చట్టపరమైన చర్యలు
ఇంత భారీ స్థాయిలో నిషేధిత జీవులను పెంచుతున్న సదరు బ్రీడర్‌పై పర్యావరణ పరిరక్షణ చట్టాల కింద అధికారులు కేసు నమోదు చేశారు. ఈ జీవులను ఎక్కడి నుంచి తెచ్చారు? దేశవ్యాప్తంగా ఎవరికైనా సరఫరా చేశారా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. దేశ బయోసెక్యూరిటీకి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకే ఈ ముందస్తు ఆపరేషన్ చేపట్టినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.







