Spandana: ఇదేం స్పందన..!

UPDATED 20th JUNE 2022 MONDAY 6:00 PM

▪️ తూతూమంత్రంగా అర్జీల స్వీకరణ

▪️ సిబ్బంది నుంచి ఎదురవుతున్న ఛీత్కారాలు

▪️ అర్జీదారులపై డీఆర్వో ఓవర్ యాక్షన్

▪️ ఫిర్యాదిదారులకు బెదిరింపులు

▪️ అభాసుపాలవుతున్న స్పందన కార్యక్రమం

▪️ రసీదులు ఇచ్చేందుకు నిరాకరణ

▪️ సాంకేతిక కారణాలను సాకుగా చూపిస్తున్న అధికారులు

▪️ ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం స్పందన.. అయితే ఈ కార్యక్రమంలో సమస్యలు పరిష్కారం కావడం దేవుడెరుగు.. అర్జీదారులకు మాత్రం ఛీత్కారాలు, బెదిరింపులు ఎదురవుతున్నాయి.. ఆప్రభావం పరోక్షంగా ప్రభుత్వ పనితీరుపై పడుతోంది..సుదూర ప్రాంతాల నుంచి ఎంతో వ్యయప్రయాసలకోర్చి తమ సమస్యలను అధికారులకు విన్నవించుకుని పరిష్కరించుకుందామని వచ్చిన అర్జీదారులతో డీఆర్వో అమర్యాదగా ప్రవర్తించడం పట్ల పలువురు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.

కాకినాడ (రెడ్ బీ న్యూస్) : సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమం ఉన్నతాధికారుల అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా నీరుకారుతోంది. దీంతో ప్రభుత్వంపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సామాన్య ప్రజలకు తమ సమస్యలు పరిష్కారంకాక ఇదేం స్పందనరా బాబూ అంటూ నిట్టూరుస్తూ నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రతీ సోమవారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమమే అందుకు ఉదాహరణ. ఎంతో ఆశతో సుదూర ప్రాంతాల నుంచి తమ సమస్యలు పరిష్కారమవుతాయన్న గంపెడాశతో వచ్చిన అర్జీదారులకు ఇక్కడ చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. సమస్య పరిష్కారం కాకపోవడంతో స్పందన కార్యక్రమం అభాసుపాలవుతోందని పలువురు చెబుతున్నారు.

అర్జీదారులను విసుక్కుంటున్న అధికారులు

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఓవైపు స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీదారులతో ఎంతో స్నేహపూర్వకంగా మెలగాలని, అలాగే వారిని చిరునవ్వుతూ పలకరించి వారి సమస్యలను సావధానంగా విని వాటిని పరిష్కరించాలని సూచించారు. కానీ అధికారులు మాత్రం అందుకు భిన్నంగా అర్జీదారులను విసుక్కోవడం, చెప్పిన సమస్యను వినకుండా ఏదో మొక్కుబడిగా ఇచ్చిన అర్జీలపై సంతకం చేసి ఇచ్చేస్తున్నారు. సమస్యను కూడా పూర్తిగా వినకుండా అర్జీదారులను అపహాస్యం పాలేస్తున్నారు. పైగా మీ సమస్య పరిష్కారమవుతుంది ఇక వెళ్లండి అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పలువురు అర్జీదారులు వాపోతున్నారు. సస్య పరిష్కారం కాకపోవడంతో అర్జీదారులు ప్రభుత్వ పనితీరుపై నిరాశ చెందుతున్నారు.

అర్జీదారులపై డీఆర్వో ఓవర్ యాక్షన్

సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో డీఆర్వో కె.శ్రీధర్ రెడ్డి ప్రవర్తన చూసి అర్జీదారులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అర్జీలు స్వీకరించే సమయంలో అర్జీదారులను విసుక్కోవడం, వారితో అమర్యాదగా మాట్లాడడం వంటి చర్యలతో పలువురు విసుగు చెందారు.. ఓ అర్జీదారుడిపై డీఆర్వో చిందులేశారు.. నువ్వు చెప్పింది వినడానికి మేము ఇక్కడ ఖాళీగా కూర్చోలేదు.. అర్జీ ఇచ్చి వెళ్లడమే మీ పని.. ఎక్కువగా మాట్లాడకు అని బెదిరింపు ధోరణిలో మాట్లాడటంతో ఫిర్యాదిదారుడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ

స్పందన కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులను పరిష్కరించడంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. ప్రచార ఆర్భాటాలే తప్ప సమస్య పరిష్కారం అయ్యిందా లేదా అనే విషయాన్ని వారు పట్టించుకోవడంలేదు. దీంతో క్రింది స్థాయి అధికారులు తప్పుడుగా రిపోర్టులు పంపి చేతులు దులిపేసుకుంటున్నారు. కేవలం అధికారులు మళ్లీ ఆ సమస్యపై దృష్టి సారించకపోవడంతోనే ఇటువంటి సమస్యలు పునరావృతం అవుతున్నాయని పలువురు చెబుతున్నారు. ఏదో మొక్కుబడిగా స్పందన కార్యక్రమంలో అర్జీలను తీసుకుని తమ పని అయిపోయినట్లు అధికారులు ఫీలవుతున్నారని పలువురు చెబుతున్నారు. సమస్యలను పరిష్కరించామంటూ గొప్పలకు పోతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి పనులు కాక ఆ ప్రభావం ప్రభుత్వం పనితీరుపై పడుతోంది. పైగా రసీదులు ఇచ్చేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సమస్య పరిష్కారమయిపోయిందంటూ క్రిందిస్థాయి అధికారులు తప్పుడు రిపోర్టులును పైకి పంపి చేతులు దులిపేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోతే ఆ ప్రభావం ప్రభుత్వంపై పడడటంతో పాటు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us