UPDATED 30 APRIL 2022 SATURDAY 11:00 PM
Electric Bike Catches Fire : దేశంలో ఎలక్ట్రిక్ బైక్ వాహనాల ప్రమాదాలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల ఎలక్ట్రిక్ బైక్ లు బాంబుల్లా పేలడం, ప్రాణాలు బలిగొనడం జరిగాయి. విద్యుత్ వాహనాల బ్యాటరీలో మంటలు చెలరేగడం, చూస్తుండగానే మంటల్లో తగలబడిపోవడం చూశాము. దీంతో ఎలక్ట్రిక్ బైక్ పేరు విన్నా చాలు.. జనాల గుండెల్లో వణకు పుట్టే పరిస్థితి ఏర్పడింది. తాజాగా మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హోసూరులో ఓ ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు చెలరేగాయి. 29ఏళ్ల వ్యక్తి బైక్ నడుపుతుండగా.. ఒక్కసారిగా సీటు కింద నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో బైక్ ఆపి మంటల నుంచి వాహనదారుడు తృటిలో తప్పించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు మంటలను అదుపు చేసేందుకు యత్నించినా లాభం లేకపోయింది.
వాహనం మంటల్లో దగ్దమైంది. ఇలాంటి ఘటనలతో ఎలక్ట్రిక్ టూవీలర్లు అంటేనే జనాలు భయపడిపోతున్నారు. వాటిని కొనాలంటే జంకుతున్నారు. ఇక విద్యుత్ వాహనం కొన్నవారు.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని కంగారుపడుతున్నారు.(Electric Bike Catches Fire)ఈ బైక్ ఓనర్ పేరు సతీశ్. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాడు. హోసూరు ఔట్ స్కర్ట్స్ లో జుజువాడి ప్రాంతంలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఒకినావా కంపెనీ తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్ బైక్ ని సతీశ్ ఏడాది క్రితం కొనుగోలు చేశాడు. జుజువాడి నుంచి ఉప్కార్ లేఔట్ కి బైక్ పై వెళ్తున్నాడు. ఆ సమయంలో సడెన్ గా సీటు కింద నుంచి మంటలు వచ్చాయి. ఇది గమనించిన సతీశ్ వెంటనే బైక్ పై నుంచి జంప్ చేసి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
స్థానికుల సాయంతో నీటితో మంటలు ఆర్పివేశాడు. అయితే, అప్పటికే బైక్ పూర్తి దగ్గమైంది. దీనిపై బాధితుడు సిప్ కాట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్.. i-Praise+ ను Okinawa కంపెనీ 2015 తయారు చేసింది.ఎలక్ట్రిక్ వాహనాలు బాంబుల్లా పేలుతూ, బ్యాటరీలో మంటలు చెలరేగి దగ్ధమవ్వడమే కాదు.. కొన్ని చోట్ల ప్రాణాలు సైతం కోల్పోతున్న ఘటనలు ఇటీవల వెలుగుచూశాయి.
స్కూటర్ బ్యాటరీ పేలి తెలంగాణలో ఒకరు మృతి చెందారు. తమిళనాడులో తండ్రీకూతురు మరణించారు. ఎలక్ట్రిక్ టూవీలర్ ఛార్జింగ్ పెట్టగా అందులోంచి వచ్చిన పొగ కారణంగా ఊపిరాడక వారిద్దరూ మరణించారు.ఎలక్ట్రిక్ బైక్ ల వరుస ప్రమాద ఘటనలను కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ఎలక్ట్రికల్ వాహనాల్లో లోపాలుంటే సదరు కంపెనీలు భారీ జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు కేంద్రం ఎలక్ట్రిక్ బైకులపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. కొత్త మోడల్స్ లాంచ్ చేయవద్దంటూ ఎలక్ట్రిక్ బైకుల కంపెనీలకు ఆదేశించింది.
ప్రస్తుతం ఉన్న మోడల్స్‌ను మాత్రమే అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చింది. e-బైక్స్‌లో బ్యాటరీలు పేలడంపై నిపుణుల బృందం దర్యాప్తు చేస్తోంది. నివేదిక వచ్చిన తర్వాత గైడ్‌లైన్స్ తయారు చేయనుంది. రోజురోజుకి పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. ఇంధన ధరలు చుక్కలను తాకుతున్నాయి. పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. బండిని బయటకు తీయాలంటేనే భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్ బాధ లేని ప్రత్యామ్నాయ వాహనాలపై దృష్టి పెట్టారు.
అదే సమయంలో ఫ్యూయల్ తో పని లేని ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా వాటికి డిమాండ్ పెరిగింది. కరెంటుతో చార్జ్ చేసుకోవడం, తక్కువ ఖర్చుతో అవసరం తీరడంతో జనం ఈ బైక్ వైపు మొగ్గు చూపారు. అయితే కొన్ని నెలలుగా చోటు చేసుకుంటున్న ఎలక్ట్రిక్ వాహన ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. వాటిని కొనాలంటే ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఈ బైక్ కొనడం అంటే, బాంబుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నట్టే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.