◆ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా
UPDATED 13th APRIL 2022 WEDNESDAY 9:00 PM
District Collector Dr. Kruthika Shukla : కాకినాడ (రెడ్ బీ న్యూస్): కాకినాడ జిల్లా పరిధిలో రహదారుల ప్రత్యేక మరమ్మతులు (ఎస్ఆర్), కాలానుగుణ పునరుద్ధరణ (పీఆర్)కు సంబంధించి మంజూరైన పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ కోర్టు హాల్లో ఆర్&బీ, జాతీయ రహదారుల అధికారులతో బుధవారం ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
కాకినాడ జిల్లాలో రహదారులు, భవనాలకు సంబంధించి మంజూరైన పనులు, వాటి పురోగతితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నాడు-నేడు పనులు, జాతీయ రహదారుల ప్రాజెక్టులపై అధికారులతో చర్చించారు. కత్తిపూడి-పామర్రు, బూరుగుపూడి-గెద్దనాపల్లి, ఏలేశ్వరం-ఎర్రవరం తదితర 202 కి.మీ. పొడవుగల రహదారులకు సంబంధించి దాదాపు రూ. 54 కోట్లతో 28 పనులు మంజూరైనట్లు ఆర్&బి అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనుల పూర్తికి కృషి చేయాలన్నారు. గండేపల్లి, రాచపల్లి, శంఖవరం, రావికంపాడు, తొండంగిలలో కొత్త పీహెచ్సీల నిర్మాణ పనులపైనా దృష్టి సారించాలన్నారు. కాకినాడ పోర్టును జాతీయ రహదారులతో అనుసంధానించే ప్రాజెక్టులు, కాకినాడ యాంకరేజ్ పోర్టు-అచ్చంపేట, సామర్లకోట-అచ్చంపేట జంక్షన్, వాకలపూడి-అన్నవరం రహదారుల ప్రాజక్టులపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో ఎన్హెచ్ఏఐ పీడీ డి. సురేంద్రనాథ్, ఆర్&బీ ఎస్ఈ కె. హరిప్రసాద్బాబు, కాకినాడ ఆర్డీవో బీ. వెంకటరమణ, పెద్దాపురం ఆర్డీవో జె. సీతారామారావు, తదితరులు పాల్గొన్నారు.