R&B Department : నరక ప్రయాణం

UPDATED 7th JUNE 2022 TUESDAY 02:00 PM 

▪️రోడ్డు పనులు చేయలేమంటూ మధ్యలో వదిలేసిన కాంట్రాక్టర్

▪️అర్థాంతరంగా నిలిచిపోయిన పెద్దాపురం - జగ్గంపేట ప్రధాన రహదారి

▪️అడుగడుగునా భారీ గుంతలతో ప్రయాణికుల అవస్థలు

▪️తామేమిచేయలేమంటున్న ఆర్ అండ్ బీ అధికారులు

▪️ఈరహదారిపై ప్రయాణంతో నిత్యం నరకం చూస్తున్న ప్రజలు

▪️ప్రకటనలకే పరిమితమైన పాలకుల హామీలు

🔹వర్షాలవల్లే రోడ్లు దెబ్బతిన్నాయి. అక్టోబరు నాటికి వర్షాలు తగ్గుముఖం పడతాయి. తరువాత పనుల కాలం మొదలవుతుంది. ముందుగా రోడ్లను బాగుచేయడంపై దృష్టి పెట్టాలి. మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లు అన్నీ బాగుచేయాలి. రోడ్ల నిర్వహణకోసం రూ. 2 వేల కోట్లతో ప్రత్యేకంగా నిధి కేటాయించాం. ప్యాచ్ వర్కులు, రిపేర్లకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యమంత్రి జగన్ గత ఏడాది సెప్టెంబరు 6వ తేదీన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు మౌఖికంగా జారీ చేసిన ఆదేశాలు. ఇది జరిగి సుమారు ఎనిమిది నెలలు దాటింది. అయినా సరే రోడ్లు మరమ్మతు పనులు మాత్రం ప్రారంభం కాలేదు. కొన్ని చోట్ల గోతుల్లో రాళ్లు మట్టి పోసి చదును చేసి చేతులు దులిపేసుకున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పరిస్థితి మళ్లీ అధ్వానంగా మారింది.

పెద్దాపురం : అడుగడుగునా గోతులు.. పలుచోట్ల రాళ్లు తేలి రాకపోకలు సాగించలేని పరిస్థితి. వర్షమొస్తే ఇక అంతే సంగతులు. ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే ఉండదు. చెరువులను తలపిస్తూ దర్శనమిస్తుంది ఆ రహదారి. అందుకు ఉదాహరణగా పెద్దాపురం నుంచి జగ్గంపేట వెళ్లే ప్రధాన రహదారి చూస్తే అర్థమవుతుంది. ఈ రహదారిపై ఎవరైనా ప్రయాణం చేయాలి అంటే హడలెత్తిపోవాల్సిందే. ఈరహదారి నిర్మాణ పనులకు సంబంధించి ప్రభుత్వం కాంట్రాక్టరుకు డబ్బులు చెల్లించకపోవడంతో అర్థాంతరంగా రోడ్డు పనులను మధ్యలోనే నిలిపివేయడంతో ప్రయాణికులు నిత్యం నరకం చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రహదారిపై నిత్యం వేలాదిగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయినా సరే రెండు సంవత్సరాల నుంచి ఈరహదారి నిర్మాణానికి నోచుకోకుండా అలాగే ఉండిపోయింది.

పనులు చేయలేమంటూ చేతులెత్తేసిన కాంట్రాక్టర్..

పెద్దాపురం పట్టణ శివారు రాజీవ్ కాలనీ నుంచి జె.తిమ్మాపురం గ్రామ జంక్షన్ వరకూ సుమారు ఆరు కిలోమీటర్ల మేర సెంట్రల్ రోడ్ ఫండ్స్ (సీఆర్ఎఫ్) నిధులతో ఈరహదారిని డబుల్ లేన్ రహదారిగా విస్తరించాలని గత టీడీపీ ప్రభుత్వ హాయాంలో ప్రతిపాదించారు. అయితే అనుకున్నదే తడవుగా అందుకు సంబంధించిన పనులు చకచకా సాగాయి. ఎన్నికలు రావడంతో మళ్లీ పనులకు బ్రేక్ పడింది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మళ్లీ ఈరహదారి విస్తరణ అంశం తెరమీదకు వచ్చింది. అందుకు సంబంధించి అధికారిక ప్రక్రియను ప్రారంభించారు. 2020 సంవత్సరంలో నవంబరు నెలలో పనులను ప్రారంభించారు. అలాగే విస్తరణకు సంబంధించి పనులను చేపట్టారు. రహదారికి సంబంధించి వెట్ మిక్స్ లేయర్ పనులను సైతం పూర్తి చేశారు. అంతవరకూ చేసిన పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి కాంట్రాక్టరుకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణం చేపట్టలేమంటూ అర్థాంతంగా పనులను నిలిపివేశాడు. దీంతో ఈరహదారిపై ప్రయాణం చేయాలంటేనే వాహన చోదకులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు పొడవునా గోతులే...

రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో నిత్యం ప్రయాణికులు నరకం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాకినాడ నుంచి ఏజన్సీ ప్రాంతాలైన ఏలేశ్వరం, అడ్డతీగల, వైరామవరం, మారేడుమిల్లి, రంపచోడవరం తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే ఈరహదారి గుండానే ప్రయాణించాల్సి ఉంటుంది. రహదారి అధ్వానంగా తయారవ్వడంతో రాళ్లు పైకి తేలిపోయి పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఈరహదారిపై ప్రయాణం చేస్తున్న వాహన చోదకులకు ఒళ్ళు హూనం అయిపోవడంతో పాటు ప్రయాణ సమయం రెట్టింపు అవుతుంది. అలాగే గోతులు కారణంగా వాహనాలు త్వరగా పాడైపోతున్నాయని పలువురు వాహన చోదకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిపాటి వర్షానికే నీరు గోతుల్లో నిలిచిపోయి చెరువులను తలపిస్తున్నాయి. రాత్రి సమయంలో అయితే పలువురు ఈగోతుల్లో పడి తీవ్రంగా గాయాలపాలవుతున్నారు.

కాంట్రాక్టరుకు నోటీసులు ఇచ్చాం..

రహదారి నిర్మాణ పనులను మధ్యలో నిలిపివేయడంపై సంబంధిత కాంట్రాక్టరుకు నోటీసులు ఇచ్చాం. కాంట్రాక్టరు నుంచి సమాధానం ఇప్పటికీ ఇంకా మాకు అందలేదు. పనులు చేపట్టకపోతే లిఖితపూర్వకంగా తమకు సమాధానం ఇవ్వాలని కోరడం జరిగింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే రహదారి నిర్మాణ పనులను చేపట్టడం జరుగుతుంది.

వెంకటరమణ, ఆర్ అండ్ బీ ఏఈ, పెద్దాపురం

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us