UPDATED 12th AUGUST 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: మున్సిపల్ పరిధిలో గల అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సామర్లకోట పట్టణంలో ఆదివారం నిర్వహించిన నగర దర్శిని-నగర వికాసం కార్యక్రమంలో భాగంగా ఆయన 16,17 వార్డులలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి భార్య భారతిపై ఇడి కేసులు నమోదు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర ఉందని జగన్ చేసిన ఆరోపణల పట్ల చినరాజప్ప మండిపడ్డారు. తుని రైలు ఘటనకు చంద్రబాబే కారణమని జగన్ చెప్పడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎస్ఈజెడ్లు, ప్రాజెక్టుల పేరిట కమీషన్లు దోచుకున్నారని ఆరోపించారు. ఆ అవినీతి సొమ్ము మింగిన జగన్ 16 నెలలు జైలు జీవితం గడిపి, 12 ఛార్జిషీట్లలో నిందితుడిగా ఉండి మళ్లీ ఎప్పుడు జైలుకు వెళతారో తెలియని పరిస్థితుల్లో ఆయన నీతులు చెప్పడం హాస్యాస్పదం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, మన్యం చంద్రరావు, బడుగు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.