Ministers Committee : సమ్మెకు వెళ్లొద్దు.. ఉద్యోగులను కోరిన మంత్రుల కమిటీ.. ఉద్యోగుల ముందు కీలక ప్రతిపాదనలు

UPDATED 4 FEBRUARY 2022 FRIDAY 08:50 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్): ఏపీ పీఆర్సీ వివాదం ఓ కొలిక్కి వస్తుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం ఓ మెట్టు దిగినట్లే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ సూచనలతో మంత్రుల కమిటీ మరోసారి ఉద్యోగులతో సచివాలయంలో చర్చలు జరుపుతోంది. ఇందులో ప్రభుత్వం ఉద్యోగుల ముందు కీలక ప్రతిపాదనలు పెట్టినట్లు తెలుస్తోంది. HRA శ్లాబుల్లో మార్పులు చేయడంతో పాటు ఐఆర్ రికవరీలు చేయబోమన్న హామీని ప్రభుత్వం ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఉద్యోగులు మాత్రం మరికొన్ని డిమాండ్లపై పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అశుతోష్‌ మిశ్రా కమిషన్ నివేదిక ఇవ్వాలని కోరారు. ఉద్యోగులు ఆదివారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు చేయడంతో ఉద్యోగ సంఘాలు ఏ నిర్ణయం తీసుకుంటాయన్నది ఆసక్తిని రేపుతోంది. ఈ భేటీలో ఏదో ఒకటి తేలుతుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మెట్టు దిగుతుందా…? ఉద్యోగులు పట్టు వీడతారా…? లేదో చూడాలి మరి.

ఓవైపు ప్రభుత్వం ఉద్యోగులతో చర్చలు జరుపుతుండగానే.. మరోవైపు ఉద్యోగులు సమ్మెకు వెళ్లేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. రేపు యాప్‌డౌన్‌, పెన్‌డౌన్ చేస్తామంటున్నారు. చర్చలు సఫలం అయ్యేవరకూ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. ఎస్మా పేరుతో మమ్మల్ని భయపెట్టలేరని అన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయబోమని స్పష్టం చేశారు.

మరోవైపు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించారు. రెండు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఉద్యోగులు సమ్మెకు దిగితే తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై సీఎం జగన్ చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మెకు దిగుతుండటంతో ప్రత్యామ్నాయ రవాణా చర్యలపై సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలు చర్చలకు వస్తే ఏ అంశాలు చర్చించాలనే అంశంపైనా చర్చించారు.

ఉద్యోగుల పీఆర్సీ, హెచ్ఆర్ఎ తదితర డిమాండ్లపైనా జగన్ చర్చించారు.ఉద్యోగ సంఘాలు చర్చలకు వస్తే చర్చలు జరిపి పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యకు ముగింపు పలకాలని ఆదేశాలు ఇచ్చారు. జగన్ తో సమావేశం అనంతరం మంత్రుల కమిటీ క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా సచివాలయానికి వెళ్లింది. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మంత్రులు బుగ్గన, బొత్స, సీఎస్ సమీర్ శర్మ సచివాలయానికి వెళ్లారు. చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలకు మరోసారి విజ్ఞప్తి చేసింది ప్రభుత్వం. ఉద్యోగ సంఘాల కోసం మంత్రుల కమిటీ సచివాలయంలో ఎదురు చూస్తోంది.

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పీఆర్సీ జీవోలను ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు ‘చలో విజయవాడ’ చేపట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడలో భారీ ప్రదర్శన నిర్వహించారు.తమది బలప్రదర్శన కాదని.. ఉద్యోగుల వేదనే ‘చలో విజయవాడ’ అని పీఆర్సీ సాధన సమితి నేతలు స్పష్టం చేశారు. ఈ నెల 5 నుంచి పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తామని.. 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు.

తమ డిమాండ్లు నెరవేర్చే వరకు తమ ఉద్యమం ఆగదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం అన్నీ దొంగ లెక్కలు చెబుతోందని ఆరోపించారు. ఈ నెల 5 నుంచి సహాయ నిరాకరణ చేపడతామని, ఉద్యోగుల సమ్మెతో ప్రజలకు అసౌకర్యం కలిగితే ఆ బాధ్యత ప్రభుత్వానిదే అని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ఉద్యోగుల ఉద్యమమంటే ఏంటో ఈ ప్రభుత్వానికి తెలియాలన్నారు. మా వెనుక లక్షలాదిగా ఉద్యోగులున్నారు, ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు కలగాలని పీఆర్సీ సాధన సమితి నేతలు అన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us