వైభవంగా శ్రీశృంగారవల్లభస్వామి కళ్యాణం

* వేడుకకు హాజరైన హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప 
* కల్యాణాన్ని తిలకించి పునీతులైన భక్తజనం

UPDATED 15th APRIL 2019 MONDAY 10:00 PM

పెద్దాపురం: సకల కల్యాణగుణ పరిపూర్ణుడైన దేవదేవుడు వరదహస్తుడై ఆశీర్వదించిన వేళ...వేద మంత్రోచ్ఛారణల నడుమ గోవింద నామస్మరణలు మిన్నంటిన శుభ సమయాన జగత్కల్యాణం అందర్నీ ఆనందపారవశ్యంతో ముంచెత్తింది. అపూర్వ ఘట్టం భక్తుల హృదయాల్లో ఆధ్యాత్మిక వైభవాన్ని నింపింది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీ, భూదేవీ సమేత శ్రీ శృంగారవల్లభస్వామి వారి దివ్య పరిణయోత్సవం సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా, కనుల పండువగా సాగింది. మహోన్నత వేడుక మంగళవాయిద్యాలు, కర్పూర కాంతుల నడుమ అంబరాన్ని తాకింది. శుభ ముహూర్త సమయంలో స్వామివారు శ్రీలక్ష్మీ, భూదేవీ అమ్మవార్ల శిరస్సులపై జీలకర్ర, బెల్లాన్ని ఉంచిన ఘట్టం భక్తుల కళ్లల్లో తళుకులీనింది. సర్వ జగత్తుకూ కల్పవల్లి, పుణ్యాలరాశి అయిన ఉభయ దేవేరులకు మాంగల్యధారణ మహోన్నతంగా జరిగింది. సర్వాభరణాలతో అలంకరించిన ఉత్సవ మూర్తులను వేదిక వద్ద కొలువుదీర్చినది మొదలు జరిగిన ప్రతీ ఘట్టం పరమార్థంతో నిండి మనోహరంగా అలరించింది. అంతకు ముందు ఉదయం ఆలయంలో సుప్రభాత సేవ, బాలభోగ నివేదన చేసిన తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం స్వామి వారి ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ వేదికపై ఆలయ అర్చకులు పెద్దింటి గోపాలాచార్యుల పర్యవేక్షణలో వేద పండితులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు, సీతారామాచార్యుల మంత్రోచ్ఛారణల నడుమ వైఖానస ఆగమ పద్దతిలో సాగిన కల్యాణ శోభను వీక్షించిన భక్తజనం పరవశించిపోయారు. మాంగల్యధారణ అనంతరం రమణీయంగా సాగిన తలంబ్రాల ఘట్టం భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. పసుపు కలిపిన అక్షతలను అర్చకస్వాములు భక్తుల శిరస్సులపై వేసి స్వామివారి ఆశీస్సులను అందజేయడంతో అంతా తన్మయత్వంతో పులకించారు. తలంబ్రాల బియ్యం కోసం భక్తులు ఆత్రంగా ఎదురు చూశారు. దొరికిన వాటిని తమ శిరస్సులపై చల్లుకుని తరించారు. ఈ కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో పాటు వివిధ ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కల్యాణ వేదిక వద్ద ఉదయం నుంచే భక్తులు అత్యధికంగా చేరుకోవడంతో ఆధ్యాత్మిక శోభ మిరుమిట్లు గొల్పింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి రాంబాబురెడ్డి, చైర్మన్ బందిలి సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమీషనర్ డి.ఎల్.వి. రమేష్ బాబు, మెయిళ్ల కృష్ణమూర్తి, ఎస్. వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.   

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us