CM Jagan : ఉద్యోగుల సమ్మె.. సీఎం జగన్ కీలక సమావేశం

UPDATED 4 FEBRUARY 2022 FRIDAY 05:10 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్): ఉద్యోగులు సమ్మెకి సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 6వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె బాట పట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారం (ఫిబ్రవరి 6) అర్థరాత్రి నుంచి ఉద్యోగులు సమ్మెకు వెళ్లనున్న నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై ఈ కీలక సమావేశంలో చర్చిస్తున్నారు.

ఉద్యోగుల పెన్ డౌన్, యాప్స్ డౌన్, ఉద్యోగ సంఘాల డిమాండ్ల అంశంపైనా మంత్రులతో చర్చిస్తున్నారు సీఎం జగన్. పీఆర్సీ సహా హెచ్ఆర్ఎ, ఇతర డిమాండ్లపైనా డిస్కస్ చేస్తున్నారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్తే తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో సీఎం జగన్ నిర్ణయం తీసుకోనున్నారు. పాలన స్తంభించకుండా తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సీఎం జగన్ సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పీఆర్సీ జీవోలను ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు ‘చలో విజయవాడ’ చేపట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడలో భారీ ప్రదర్శన నిర్వహించారు.తమది బలప్రదర్శన కాదని.. ఉద్యోగుల వేదనే ‘చలో విజయవాడ’ అని పీఆర్సీ సాధన సమితి నేతలు స్పష్టం చేశారు. ఈ నెల 5 నుంచి పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తామని.. 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు తమ ఉద్యమం ఆగదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం అన్నీ దొంగ లెక్కలు చెబుతోందని ఆరోపించారు. ఈ నెల 5 నుంచి సహాయ నిరాకరణ చేపడతామని, ఉద్యోగుల సమ్మెతో ప్రజలకు అసౌకర్యం కలిగితే ఆ బాధ్యత ప్రభుత్వానిదే అని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ఉద్యోగుల ఉద్యమమంటే ఏంటో ఈ ప్రభుత్వానికి తెలియాలన్నారు. మా వెనుక లక్షలాదిగా ఉద్యోగులున్నారు, ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు కలగాలని పీఆర్సీ సాధన సమితి నేతలు అన్నారు.

పీఆర్సీ విషయంలో అటు ఉద్యోగులు, ఇటు ప్రభుత్వం.. వెనక్కి తగ్గడం లేదు. ఇరు వర్గాలు పట్టుదలగా ఉన్నాయి. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తుంటే.. జీవోలు రద్దు చేయడం కుదరదని, అవసరమైతే మార్పులు చేస్తామని ప్రభుత్వం అంటోంది. ఉద్యోగులపై మేం ఎక్కడా ఒత్తిడి చేయలేదు. ఉద్యోగుల డిమాండ్లను మేం కాదనడం లేదు. కానీ, వాళ్లు చర్చలకు రావాలి కదా..? అని మంత్రులు అంటున్నారు. ఉద్యోగులను ఎక్కడా భయపెట్టలేదని చెప్పారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక ఇప్పుడు చూసినా ఉపయోగం లేదన్నారు. ఉద్యోగస్తులు వ్యవస్థలో భాగస్వాములు అని, చర్చలకు రాకుండా తాము కోరుకున్నదే జరగాలంటే ఎలా? అని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులకు అన్యాయం చేయాలని సీఎం జగన్ భావించడం లేదని, చర్చలకు వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మంత్రులు స్పష్టం చేశారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us