Pawan Kalyan: 28 ఎంపీలు ఉన్నా.. పోలవరానికి నిధులు తేలేకపోయారు..

Updated 2 February 2022 Wednesday 09:00 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకోవడంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. జాతీయ ప్రాజక్టు హోదా ఉన్న పోలవరానికి 2022-23 బడ్జెట్లో కేటాయింపులు కనిపించలేదంటే.. వైసీపీ తరపున ఉన్న 28 మంది ఎంపీలు (22మంది. లోక్ సభ సభ్యులు, ఆరుగురు రాజ్యసభ సభ్యులు) ఢిల్లీలో ఏం సాధించినట్టు అని ప్రశ్నించారు. ఈ పరిస్థితి చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసినప్పుడుగానీ, సంబంధిత అధికారులతో చర్చల్లో గానీ పోలవరం ప్రాజెక్ట్ గురించి కనీసం ప్రస్తావిస్తున్నారా అనే సందేహం కలుగుతోందన్నారు. ఈ మేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

"ముఖ్యమంత్రి దిల్లీ పర్యటన ప్రకటనల్లో మాత్రం పోలవరం గురించి అడిగాం అంటారు. కేంద్ర బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టు కోసం అందుకున్న నిధులు కేవలం రూ. 5163.2 కోట్లే. ఈ విధంగా అయితే పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుంది? యమునా నదికి ఉప నదులైన కెస్-బెత్వా ప్రాక్ట్ కోసం ఈ బడ్జెట్లో రూ.14 కోట్ల ప్రతిపాదనలు ఉన్నాయి. అంటే కేంద్రం జలవనరుల రంగానికి సానుకూలంగా నిధులు ఇస్తోంది. సాధించడంలోనే వైసీపీ ప్రభుత్వం ఆలసత్వం కనిపిస్తోంది. కేంద్రం దగ్గర రాష్ట్ర అవసరాలను, ఇక్కడి ప్రజల ప్రయోజనాలను.. అదే విధంగా పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా బహుళార్థ సాధకమో వివరించి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 30.7 లక్షల ఎకరాలకు సాగు అవసరాలు, 28 లక్షల మందికి తాగు అవసరాలు తీరుతాయి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ ఎంపీలకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అంచనా వ్యయం రూ. 47,725 కోట్ల మేరకు పెంచడానికి సాంకేతిక సలహా మండలి అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి నిధులు తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలనే సంకల్పం ఉన్నట్లు లేదు. 2021 డిసెంబర్ 1 నాటికి ప్రాక్ట్ పూర్తి చేసి, 2022 ఖరీఫ్ పంటకు నీళ్లు ఇస్తామని అసెంబ్లీలో ప్రకటనలు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆ మాటే మరచిపోయింది. పునరావాసం, పరిహారం ప్రక్రియ ఇంకా 80శాతం మిగిలే ఉంది. ఇందుకోసం ఇంకా దాదాపుగా రూ. 25 వేల కోట్లు అవసరం అని అంచనా ఉంది. ప్రాజెక్ట్ నిర్మాణాలు వివిధ దశల్లోనే ఉన్నాయి.. కీలకమైన ఎర్త్ కామ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు ఇంకా మొదలుకాలేదు. పునరావాస, పరిహార ప్రక్రియ ముందుకు సాగడం లేదు. నిధుల సాధనలో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వ వైఖరి చూస్తుంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో కూడా అంచనాలకు అందటం లేదు" అని ప్రకటనలో పేర్కొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us