Kodali Nani : త్వరలో మళ్లీ 3 రాజధానుల బిల్లు:మంత్రి కొడాలి నాని

UPDATED 11th FEBRUARY 2022 FRIDAY 05:15 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్): ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానులు, అశోక్ బాబు అరెస్ట్, సినీ పరిశ్రమ సమస్యల అంశాలపై మంత్రి కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ విషయంలో టీడీపీ నేతలు, చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు. ప్రజా పాలన చేయమంటే వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటున్నారని జగన్ ను ఉద్దేశించి టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రాజారెడ్డి పేరు ఎత్తడానికి మీకేం అధికారం ఉందని మంత్రి కొడాలి నాని నిలదీశారు. రాజారెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. అశోక్ బాబు తప్పు చేశారన్న మంత్రి.. సీఐడీ విచారణలో అదే తేలిందన్నారు. అశోక్ బాబుని కోర్టులో ప్రవేశపెడతారని, ఏం చెయ్యాలో కోర్టు నిర్ణయం తీసుకుంటుందన్నారు మంత్రి కొడాలి నాని.

”అశోక్ బాబు నీతిమంతుడు, నిజాయితీపరుడు అంటూ టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇంటర్ చదివి డిగ్రీ చదివినట్టు దొంగ సర్టిఫికెట్ పెట్టి ప్రమోషన్ కొట్టేశాడు. వేరొకరికి రావాల్సిన ఉద్యోగం దొబ్బేయ్యడం తప్పుకాదా..? రాష్ట్రం విడిపోతే ఉద్యోగ సంఘాల ముసుగులో చంద్రబాబుకి అనుకూలంగా పని చేశాడు. ఈ కేసుని ఎన్నికల సంఘం పరిశీలించి లోకాయుక్తకి ఇస్తే.. లోకాయుక్త సీఐడీకి ఇచ్చింది. అసలు అశోక్ బాబుపై కేసు పెట్టింది సహ ఉద్యోగి. వైసీపీ పార్టీ కాదు. చంద్రబాబు కోసం అశోక్ బాబు ఎన్నో నీచమైన పనులు చేశాడు. టీడీపీ నేతలు ఈ విషయంలో ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి” అని వార్నింగ్ ఇచ్చారు మంత్రి కొడాలి నాని.

రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతామన్న మంత్రి కొడాలి నాని.. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానులపై సమగ్రమైన బిల్లు పెడతామన్నారు. ”ఉద్యోగులు చంద్రబాబుని నీచుడు అని చెబుతారు. 2018లో ఇవ్వాల్సిన పీఆర్సీ ఇవ్వకుండా ఎందుకు ఆలస్యం చేశారు. ఎన్నికల ముందు ఫిట్ మెంట్ ఇస్తానని జీవో ఇచ్చారు. కానీ అమలు చేయలేదు. చంద్రబాబు… పోలవరాన్ని ఏటీఎంలా వాడుకుంటున్నాడని ప్రధాని మోదీ చెప్పారు. చంద్రబాబుకి దమ్ముంటే.. మోదీకి హిందీలో కానీ ఇంగ్లీష్ లో కానీ లేఖ రాయాలి. లేదంటే ఢిల్లీ వెళ్లి అడగాలి. 48 గంటల్లో అండమాన్ లేదా తీహార్ జైలులో పెడతారు” అని మంత్రి కొడాలి నాని అన్నారు.

”రాష్ట్రం విడిపోయాక అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సినీ పరిశ్రమని గాలికి వదిలేశారు. సినీ పరిశ్రమ ఇబ్బందులపై కమిటీ వేసి సమస్య పరిష్కారం చేసిన వ్యక్తి సీఎం జగన్. ఇండస్ట్రీలో అపారమైన అనుభవం ఉన్న పెద్ద మనిషిగా చిరంజీవితో కలిసి సీఎం జగన్ పరిష్కరించారు. నిన్నటి సమావేశం పూర్తిగా అధికారికంగా జరిగింది. సీఎస్ తో పాటు ఉన్నతాధికారులు ఉన్నారు. సినిమా వాళ్లని బెదిరించారు, పిలిపించుకున్నారు అని చంద్రబాబు గాలి విమర్శలు చేస్తున్నారు. ప్రజల సమస్యల గురించి మాట్లాడే అవకాశం లేక పార్లమెంటులో క్యాసినో, కోడిపందాల గురించి టీడీపీ ఎంపీలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఓ 15 రోజులు క్యాసినో, గుడివాడ, కొడాలి నాని అని ఊదరగొట్టారు. ఇక్కడ చాలదని పార్లమెంటులో మాట్లాడారు. అసలు అక్కడ ఏమైనా జరిగితే కదా? వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా, పెండింగ్ నిధులు గురించి మాట్లాడితే టీడీపీ మాత్రం క్యాసినో అంటోంది” అని కొడాలి నాని విమర్శించారు.

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. గురువారం రాత్రి సీఐడీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అశోక్‌ బాబు ఉద్యోగ సమయంలో విద్యార్హతను తప్పుగా చూపించారని సీఐడీ ఇప్పటికే అభియోగాలు నమోదు చేసింది. పదోన్నతి విషయంలో విద్యార్హత తప్పుగా చూపించారని అశోక్ పై ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఐడీ అధికారులు గురువారం రాత్రి ఇంటి దగ్గర అదుపులోకి తీసుకున్నారు. అశోక్‌బాబు వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీవోగా పని చేసి రిటైర్‌ అయ్యారు.

అశోక్ బాబు డిగ్రీ చదవకుండానే చదివినట్లుగా చూపించారని ఉమ్మడి రాష్ట్రంలోనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉమ్మడి రాష్ట్రంలోనే శాఖాపరమైన విచారణ జరిగింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని అశోక్‌బాబు వివరణ ఇచ్చారు. దీనిపై విజిలెన్స్‌ అధికారులు కూడా విచారణ జరిపి.. ఆయనపై అభియోగాలను ఉపసంహరించారు.

అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలోనే ఈ కేసు ముగిసిపోయింది. అశోక్‌బాబు ఏపీ ఎన్జీవో నేతగా, సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో జేఏసీ అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరగా.. ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇటీవల అశోక్‌బాబుపై ఏపీ ప్రభుత్వం మరోసారి పాత ఆరోపణలను బయటికి తీసింది. తమకు అందిన ఫిర్యాదు మేరకు.. విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐడీకి లోకాయుక్త సూచించింది.

దీంతో సీఐడీ వెంటనే కేసు నమోదు చేసింది. ప్రభుత్వం తనపై లోకాయుక్తకు మళ్లీ ఫిర్యాదు చేయించిందని అశోక్ బాబు ఆరోపిస్తున్నారు. అశోక్ బాబు అరెస్టుపై టీడీపీ మండిపడింది. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే అశోక్‌బాబును సీఐడీ అరెస్టు చేసిందని ఆరోపించారు. సర్వీస్‌ విషయంలో తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని.. అర్ధరాత్రి పూట అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు.

ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకే ప్రభుత్వం కక్షగట్టిందన్నారు. జగన్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుకు మూల్యం చెల్లిస్తుందని నారా లోకేష్ హెచ్చరించారు. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్నందుకే కక్ష సాధింపు చర్య అని ధ్వజమెత్తారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us