TTD : రూ.3,096 కోట్లతో టీటీడీ బడ్జెట్‌కు ఆమోదం

UPDATED 17th FEBRUARY 2022 THURSDAY 10:00 PM

TTD Board: తిరుమల తిరుపతి దేవస్థానం 2022-23 బడ్జెట్‌ను రూ.3,096.40 కోట్లతో ఆమోదించినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కోవిడ్-19 నిబంధ‌న‌లను స‌డ‌లించిన నేప‌థ్యంలో త్వ‌ర‌లో కోవిడ్‌కు ముందులాగా శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు పున‌రుద్ధ‌రించ‌డంతో పాటు, స‌ర్వ‌ ద‌ర్శ‌నం, శీఘ్ర ద‌ర్శ‌నం టికెట్ల సంఖ్య‌ను క్ర‌మంగా పెంచాల‌ని బోర్డు తీర్మానించిన‌ట్లు చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగ్గా.. టీటీడీ ఛైర్మన్ అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు టీటీడీ ఆధ్వ‌ర్యంలో రూ.230కోట్ల‌తో శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్లల సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిటల్ భ‌వ‌నాల‌ నిర్మాణానికి ఆమోదం తెలపినట్లు చెప్పారు.

ఆసుప‌త్రి భ‌వ‌న నిర్మాణాలు రెండు సంవ‌త్స‌రాల్లోపు పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇందుకు సంబంధించి త్వ‌ర‌లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో భూమిపూజ చేయించబోతున్నామని, టెండ‌ర్ల ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించినట్లు చెప్పారు. శ్రీ ప‌ద్మావ‌తి హృద‌యాల‌యంకు అవ‌స‌ర‌మైన వైద్య ప‌రిక‌రాల కోనుగోలుకు టీటీడీ జెఈవో ఆధ్వ‌ర్యంలో నిపుణుల క‌మిటీ ఏర్పాటు చేశారు. శ్రీ ప‌ద్మావ‌తి హృద‌యాల‌యం ప్రారంభించి 100 రోజుల‌లో 100 ఆప‌రేష‌న్లు నిర్వ‌హించామని చెప్పారు. తిరుప‌తిలో గ‌రుడ వార‌ధి నిర్మాణం కోసం ఏడాదిలో ద‌శ‌ల వారీగా టిటిడి వాటాగా రూ.150 కోట్లు చెల్లించి, వ‌చ్చే ఏడాది డిసెంబ‌రు నాటికి శ్రీ‌నివాస సేతు ఫ్లైఓవ‌ర్‌ను ప్ర‌జ‌ల‌కు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

రూ.2.73కోట్ల‌తో స్విమ్స్‌కు కంప్యూట‌ర్లు కోనుగోలు చేసి పూర్తిస్థాయిలో కంప్యూట‌రీక‌ర‌ణ‌కు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. టీటీడీ ఉద్యోగులు, పెన్ష‌న‌ర్లకు కార్పొరేట్ ఆసుప‌త్రుల్లో న‌గ‌దు ర‌హిత వైద్యం అందించ‌డానికి రూ.25కోట్ల నిధి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తిరుచానూరు స‌మీపంలోని శ్రీ ప‌ద్మావ‌తి నిల‌యంను బాలాజీ జిల్లా క‌లెక్ట‌రెట్‌గా రాష్ట్ర ప్ర‌భుత్వానికి టీటీడీ నిబంధ‌న‌ల మేర‌కు లీజుకు ఇచ్చేందుకు నిర్ణ‌యం తీసుకున్నట్లు చెప్పారు.

తిరుమ‌ల మాతృశ్రీ త‌రిగొండ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో స్టీమ్ ద్వారా అన్న‌ప్ర‌సాదాల త‌యారు చేస్తున్న విష‌యం తెలిసిందే. టీటీడీ గ్యాస్‌, డీజిల్ ద్వారా కేజి స్టీమ్ త‌యారీకి 4 రూపాయ‌ల 71 పైస‌లు ఖ‌ర్చు చేస్తోంది. NEDCAP వారు సోలార్ సిస్ట‌మ్ RESCO మోడ‌ల్ స్టీమ్‌ను కేజి 2 రూపాయ‌ల 54 పైస‌లతో 25 సంవ‌త్స‌రాల పాటు స‌ర‌ఫ‌రా చేయ‌డానికి ఒప్పందం. త‌ద్వారా టిటిడికి దాదాపు రూ.19 కోట్లు ఆదాయం చేకూరుతుంది. తిరుమ‌ల‌లో రాబోవు రోజుల్లో హోట‌ళ్ళు, ఫాస్ట్‌ఫుడ్ సెంట‌ర్లు లేకుండా చేసి ముఖ్య కూడ‌ళ్ళ‌లో ఉచితంగా అన్న‌ప్ర‌సాదాలు అందించాల‌ని నిర్ణ‌యించారు. అత్యున్న‌త స్థాయి నుంచి సామాన్య భ‌క్తుడి వ‌ర‌కు ఒకే ర‌క‌మైన ఆహారం అందించాల‌ని తీర్మానం చేశారు. ఈ నిర్ణ‌యం వ‌ల్ల ఇబ్బంది ప‌డే వ్యాపారుల‌కు ఇత‌ర వ్యాపారాలు చేసుకోవ‌డానికి లైసెన్స్‌లు మంజూరు చేయాల‌ని తీర్మానం చేశారు.

తిరుప‌తిలోని అలిపిరి వ‌ద్ద సైన్స్‌సిటి నిర్మాణానికి మంజూరు చేసిన 70 ఎక‌రాల భూమిలో 50 ఎక‌రాలు వెన‌క్కు తీసుకుని ఆధ్యాత్మిక న‌గ‌రం నిర్మించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ ప‌నుల‌కు త్వ‌ర‌లో ముఖ్య‌మంత్రితో శంకుస్థాప‌న‌ చేయనున్నారు. తిరుమ‌ల నాద‌నీరాజ‌న మండ‌పం షెడ్డు స్థానంలో శాశ్వ‌త మండ‌పం నిర్మించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అన్న‌మ‌య్య మార్గం త్వ‌ర‌లో భ‌క్తుల‌కు అందుబాటులోకి తేవ‌డానికి ఇప్పుడున్న మార్గాన్ని అభివృద్ధి చేయాల‌ని తీర్మానం చేశారు.

అట‌వీశాఖ అనుమ‌తులు ల‌భించిన త‌రువాత పూర్తి స్థాయిలో అభివృద్ధి ప‌నులు చేప‌ట్టాల‌ని తీర్మానం చేశారు. రూ.3.60 కోట్ల‌తో టీటీడీ ఆయుర్వేద ఫార్మ‌సీకి ప‌రిక‌రాలు కొనుగోలు చేసి రాష్ట్రవ్యాప్తంగా ఆయుర్వేద మందులు అందుబాటులో ఉంచాల‌ని తీర్మానం చేశారు. శ్రీ‌వారి ఆల‌య మ‌హ‌ద్వారం, బంగారువాకిలి, గోపురంకు బంగారు తాప‌డం చేయించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. గోపురాల బంగారు తాప‌డం విష‌యంపై ఆగ‌మ పండితుల‌తో చ‌ర్చించి క్రేన్ స‌హ‌యంతో తాప‌డం ప‌నులు పూర్తి చేయించే సాధ్యాసాధ్యాలు ప‌రిశీలించాల‌ని అధికారుల‌కు ఆదేశం.

ముంబైలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి భూమి కేటాయింపు కోసం నెలాఖ‌రులోపు మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిని క‌ల‌వాల‌ని నిర్ణ‌యం. ఈ మేర‌కు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ మిలింద్ న‌ర్వేక‌ర్‌కు స‌మ‌న్వ‌య బాధ్య‌త‌లు అప్ప‌గింత‌. అలాగే ఇప్ప‌టికే కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకుని స‌మాచార కేంద్రం నిర్మించాల‌ని తీర్మానం చేశారు. సామాన్య భ‌క్తులకు కేటాయించే ఆర్జితసేవా టికెట్ల ధ‌ర‌లు పెంచిన‌ట్లు జ‌రిగిన ప్ర‌చారం అవాస్త‌వమని అన్నారు. ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సమావేశంలో ఈవో డాక్టర్ కె.ఎస్. జవహర్ రెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి శ్రీ‌మ‌తి వాణి మోహ‌న్‌, దేవాదాయ శాఖ కమిషనర్ హరిజవహర్ లాల్, అద‌న‌పు ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి, బోర్డుసభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పోక‌ల ఆశోక్ కుమార్‌, స‌న‌త్‌కుమార్‌, మారుతీ ప్ర‌సాద్‌, కాట‌సాని రాంభూపాల్ రెడ్డి, మ‌ధుసూధ‌న్ యాద‌వ్‌, సంజీవ‌య్య‌, విశ్వనాథ్, రాములు, విద్యాసాగర్, శ్రీమ‌తి మల్లీశ్వరి, శివకుమార్, ఢిల్లీ స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షురాలు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, చెన్నైస్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షులు శేఖ‌ర్ రెడ్డి, జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో గోపినాథ్ జెట్టి ఉన్నారు. అనంత‌రం జ‌రిగిన ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌నిర్వ‌హ‌క మండ‌లి స‌మావేశంలో శ్రీ‌నివాస వ్ర‌త విధానం పుస్త‌కాలు ముద్రించి భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us