కనులపండువగా స్వామివారి తెప్పోత్సవం

అన్నవరం, (రెడ్ బీ న్యూస్) 16 నవంబరు 2021 : కోరిన కోర్కెలు తీర్చి, భక్తుల పాలిట కొంగుబంగారమై విరాజిల్లుతున్న సత్యదేవుడి నౌకావిహారం మంగళవారం రాత్రి భక్తజన గోవింద నామస్మరణ మధ్య నయనానందకరంగా జరిగింది. అనంతలక్ష్మి సమేత స్వామి హంస వాహనంపై పంపా సరోవరంలో ముమ్మారు విహరించగా భక్తులు పరవశించారు. విద్యుద్దీపాలంకరణలు, బాణసంచా కాల్పుల నడుమ జరిగిన ఈ వేడుక ఘనంగా జరిగింది. సాయంత్రం 5.30 గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవారు, క్షేత్రపాలకులైన సీతారాములను మేళతాలాలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ ఘాట్‌ రోడ్డు గుండా పంపా సరోవర తీరానికి తోడ్కొనివచ్చారు. వివిధ సుగందభరిత పుష్పాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన ప్రత్యేక వేదికపై స్వామి, అమ్మవార్లను, మరో వేదికపై క్షేత్రపాలకులు సీతారాములను ఆశీనులు చేసి వేదస్వస్తితో కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు. విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం శ్రీసూక్త,పురుష సూక్త విధానంలో తులసిదాత్రి పూజను ప్రధానార్చకుడు కోట శ్రీను ఆధ్వర్యంలో అర్చకస్వాములు నిర్వహించారు. ఆషాడశుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు పాలసముద్రంలో శయనిస్తారు. బాద్రపద ఏకాదశి రోజున స్వామి ఒక పక్కకు ఒరిగిఉంటారు. కార్తీకమాసంలో వచ్చే క్షీరాబ్దిద్వాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొనడానికి ప్రతీకగా ఈ వేడుక చేస్తారు. శ్రీమహావిష్ణు స్వరూపుడైన సత్యదేవునికి ఈ పర్వదినం పురస్కరించుకుని ఏటా తెప్పోత్సవం నిర్వహిస్తారు. పంపా తీరం వద్ద పూజలనంతరం ప్రత్యేకంగా రూపొందించిన హంస వాహనంపై స్వామి, అమ్మవార్లను ఆశీనులు చేసి మరో పర్యాయం పూజలు నిర్వహించారు. అనంతరం పంపా సరోవరంలో స్వామివార్లను విహరింపజేశారు. తర్వాత భక్తులకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌, చైర్మన్‌ ఐవీ రోహిత్‌, సహాయ కమిషనర్‌ రమేష్‌బాబు, ఈవో త్రినాథరావు, డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, పీఆర్వో కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us