ఆదిత్యలో ఘనంగా కాటన్ జయంతి వేడుకలు

UPDATED 15th MAY 2018 TUESDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో సర్ ఆర్థర్ కాటన్ 215వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాటన్ విగ్రహానికి ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన గండేపల్లి తహసీల్దార్ గీతాంజలి మాట్లాడుతూ కరువుతో డెల్టా వాసులు పొట్టచేత పట్టుకుని వలసలు పోయే పరిస్థితుల్లో బీడు భూములను బంగారం పండే మాగాణులుగా మార్చిన మాంత్రికుడిని, నీటితో నేలరాతను మార్చి అన్నదాతగా మారిన అపర భగీరధుడన్నారు. ధవళేశ్వరంలో ఆనకట్ట నిర్మించి ఉభయగోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన సర్ ఆర్థర్ కాటన్ గోదావరి జిల్లాల వాసులకు ఆరాధ్యదైవం అని ఆమె కొనియాడారు. ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గోదావరి జలాలను పొలాలకు తరలించిన అపర భగీరధుడు, నిస్వార్థ ప్రజా సంక్షేమ నిరతుడు కాటన్ అని, తెలుగు ప్రజలతో నిత్యం పూజలందుకుంటున్న మహనీయుల్లో ప్రథమస్థానంలో ఉన్నారన్నారు. ఎక్కడో బ్రిటీష్ గడ్డపై పుట్టి, ఉద్యోగరీత్యా భారతదేశం వచ్చి ఇక్కడి రైతులు పడుతున్న కష్టాలకు చలించి ధవళేశ్వరం వద్ద ఆనకట్టను నిర్మించి రెండు జిల్లాలను సస్యశ్యామలం చేయడమే కాకుండా మన ప్రాంతాలను ధాన్యాగారాలుగా మార్చిన కృషీవలుడని అన్నారు. ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ డా. టి.కె. రామకృష్ణారావు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం ఏమాత్రం అందుబాటులో లేని రోజుల్లో రెండు జిల్లాల పరిధిలో ఆనకట్టను, కాలువల వ్యవస్థలను కేవలం అయిదేళ్ల వ్యవధిలో పూర్తిచేసి భావి ఇంజినీర్లకు మార్గదర్శకంగా నిలిచారని అన్నారు. ఆదిత్య కాలేజ్ అఫ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్ మాట్లాడుతూ గోదావరి ఉన్నంతవరకూ గోదావరి జిల్లా వాసుల హృదయాలలో కాటన్ చిరస్థాయిగా నిలిచిపోతాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల రెవిన్యూ అధికారి నాగేశ్వరావు, సర్వేయర్ సఫీ, సూరంపాలెం వి.ఆర్.వో వెంకటేశ్వరావు, వైస్ ప్రిన్సిపాల్స్, వివిధ విభాగాధిపతులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us