జగ్గన్నతోట జనసంద్రం

★ కోనసీమలో వైభవంగా సాగిన ప్రభల తీర్థం ఉత్సవాలు

అంబాజీపేట (రెడ్ బీ న్యూస్) 16 జనవరి 2022 : కనుమ పండుగను పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఆదివారం నిర్వహించిన ప్రభల తీర్థం నయనమనోహరంగా సాగింది. కోనసీమలో సుమారు 120 గ్రామాల్లో ప్రభల తీర్థం ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధానంగా కోనసీమలోని కొత్తపేట, కొర్లగుంట, అంబాజీపేట మండలం మొసలపల్లిలోని జగ్గన్నతోటలో జరిగిన ప్రభల తీర్థం చూసేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ప్రభల ఊరేగింపుతో పాటు భారీ స్థాయిలో బాణసంచా కాల్చారు. ‘హరహర మహాదేవ శంభో శంకర’ అంటూ ప్రభలను భుజాలకెత్తుకుని ఊరేగించారు. జగన్నతోటలో 11 గ్రామాల నుంచి ఏకాదశ రుద్రులతో కూడిన ప్రభలు వచ్చి కొలువుదీరాయి. ఏకాదశ రుద్రులను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం నుంచి చెన్నమల్లేశ్వరస్వామి, వీరేశ్వరస్వామి ప్రభలను తీసుకువస్తున్న క్రమంలో పచ్చని చేలను తొక్కుకుంటూ పంట కాలువను దాటిస్తున్న తీరు చూపరులను గగుర్పాటుకు గురిచేసింది. మిగిలిన ప్రభలను కూడా ఆయా గ్రామాల నుంచి ఊరేగింపుగా తీర్థానికి తీసుకువచ్చారు. గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నమల్లేశ్వరస్వామి, వ్యాఘ్రేశ్వరం నుంచి వ్యాఘ్రేశ్వరస్వామి, కె.పెదపూడి నుంచి మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ నుంచి ఆనందరామేశ్వరస్వామి, వక్కలంక నుంచి కాశీవిశ్వేశ్వరస్వామి, నేదునూరు నుంచి చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల నుంచి రాఘవేశ్వరస్వామి, మొసలపల్లి నుంచి మధుమాతంగ భోగేశ్వరస్వామి, పాలగుమ్మి నుంచి చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు నుంచి అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి ప్రభలు తరలివచ్చాయి. ఏకాదశ రుద్రులకు ప్రతీకలుగా భావించే ప్రభలను విశేషంగా అలంకరించారు. వరి కంకులు, గుమ్మడికాయలు, పలురకాల పూలతో అలంకరించిన ప్రభలు భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us