అన్ని రంగాల్లో యువతకు శిక్షణా కార్యక్రమాలు

UPDATED 12th NOVEMBER 2018 MONDAY 5:30 PM

పెద్దాపురం: అన్ని రంగాల్లో యువతకు ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వారి భవిష్యత్తుకు మార్గదర్శకం చూపిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. స్థానిక పాత ఆర్టీసీ బస్టాండ్ భవనంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్, కార్మికశాఖ సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారికి వృత్తిపరమైన పనిముట్ల కిట్లు, సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఎన్ఎసి రీజియనల్ డైరెక్టర్ పి. మురళీధర్ అధ్యక్షతన జరిగిన ఈ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప పాల్గొని మాట్లాడారు. భవిష్యత్తులో యువత హుందాగా జీవించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ఎసిని స్థాపించి అన్ని రంగాల్లోనూ యువతకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే నియోజకవర్గంలో ఈ శిక్షణ కార్యక్రమం మొదటగా సామర్లకోట పట్టణంలో నిర్వహించడం జరిగిందని, పెద్దాపురంలో ఎక్కువమంది కార్మికులు కలిగి ఉండడంతో ఈ సంస్థను ఇక్కడ కూడా ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. 15 రోజులపాటు ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందని, ప్రభుత్వపరంగా స్టైఫండ్, ఉచిత భోజన సౌకర్యం కల్పించామని తెలిపారు. యువత చెడు వ్యసనాల జోలికి పోకుండా వారిలోని నైపుణ్యాన్ని శిక్షణ ద్వారా మరింత మెరుగు పరుచుకుని ఉన్నత స్థాయికి రావాలని తెలిపారు. ప్రస్తుతం దేశం, రాష్ట్రంలోను హౌసింగ్ పనులు ఎక్కువగా జరుగుతున్నాయని, దీనికి సంబంధించి తాపీమేస్త్రీలు, వడ్రంగి పనివారు, ఎలక్ట్రీషియన్లు, పెయింటర్లు, తదితరులు ఈ శిక్షణ పొందడం వల్ల వారికి ఎక్కువ జీతాలు పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. కార్మికుల భద్రతకు ప్రభుత్వం చంద్రన్న బీమా పథకం ప్రవేశపెట్టి రూ.5 లక్షల వరకు ప్రమాద భీమాను వర్తింపచేస్తుందని చెప్పారు. ప్రతీ  కుటుంబానికి ప్రభుత్వం పది వేల రూపాయల ఆదాయం సమకూర్చుకునేలా చర్యలు తీసుకుంటుందని, భవిష్యత్తులో దీనిని రూ.25 వేల వరకు పెంచే ఆలోచనలో ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు మాట్లాడుతూ ఏ పనిలోనైనా శిక్షణ తప్పనిసరని, దీని ద్వారా పనిలోని జాగ్రత్తలు, మెలకువలు తెలుసుకుని నాణ్యమైన పనిని అందించవచ్చని చెప్పారు. ఎపిబివో సీడబ్ల్యూడబ్ల్యూబి సభ్యుడు గల్లా రాము మాట్లాడుతూ ఈ సంస్థ ద్వారా లక్షా 30 వేల మందికి శిక్షణ ఇచ్చామని, ఈ శిక్షణకు రూ.170 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, స్టైఫండ్ రూ.200 నుంచి 300 పెంచామని చెప్పారు. ఈరోజు రూ.2200 విలువగల కిట్లు మంత్రి చేతుల మీదుగా అందచేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, ఎన్ఏసి అసిస్టెంట్ డైరెక్టర్ రఘునాథబాబు, ఆత్మ చైర్మన్ కలకపల్లి రాంబాబు, రంధి సత్యనారాయణ, కౌన్సిలర్లు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కెఎస్ఎస్ఎన్ రఘుపతి, మున్సిపల్ కమీషనర్ బిఆర్ శేషాద్రి, శిక్షణ పొందిన కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us