Draksharama: వైభవంగా భీమేశ్వరుని రథోత్సవం

UPDATED 16th FEBRUARY 2022 WEDNESDAY 05:00 AM

ద్రాక్షారామ : ద్రాక్షారామ భీమేశ్వరుని కల్యాణ మహోత్సవంలో భాగంగా భీమేశ్వరస్వామివారి రథోత్సవం మంగళవారం భక్తుల కోలాహలంతో వైభవంగా జరిగింది. మధ్యాహ్నం కల్యాణ మూర్తులైన మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి, లక్ష్మీ సమేత నారాయణస్వామి, చండికా సమేత సూరేశ్వరస్వామి వార్లను పుష్పాలంకృతమైన రఽథంపై అర్చక స్వాములు అధిష్ఠింపచేశారు. ధూపసేవ అనంతరం రథాంగబలి సమర్పించారు. దేవదాయశాఖ సహాయ కమిషనరు కేఎన్‌వీడీవీ ప్రసాద్‌, వైస్‌ ఎంపీపీ శాకా బాబి, సర్పంచ్‌ కొత్తపల్లి అరుణ కొబ్బరికాయ కొట్టి రథోత్సవం ప్రారంభించారు.

స్వామివారి రథం ఆలయం వద్దనుంచి చంద్రవీధి గుండా వెలంపాలెం చేరుకుని సూర్యవీధి మీదుగా మెయిన్‌రోడ్డు చేరుకుంది. తదుపరి మార్కెట్‌, యానం సెంటర్‌నుంచి వేగాయమ్మపేట చేరుకుంది. రథంలో ఆశీనులైన కల్యాణమూర్తులు స్వామి, అమ్మ వార్లను పురవీధులలో భక్తులు దర్శించుకున్నారు. ఇక రథం వేగాయమ్మపేటలో ఆస్థాన మండపం చేరుకుంది. రాత్రి ఆస్థాన మండపంలో కల్యాణమూర్తులకు ఆస్థాన పూజ జరిగింది. వేద స్వస్తి అనంతరం పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వాడ్రేవు సుందర రత్నకరావు, ఉత్సవ ప్రత్యేక అధికారి జె.రామలింగేశ్వరావు, ఆలయ సిబ్బంది, ఆలయ ఆస్థాన పండితులు దేవులపల్లి ఫణిరామకృష్ణ, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. రధోత్సవం పురస్కరించుకుని సీఐ వి.శ్రీనివాస్‌, ఎస్‌ఐ తులసీరామ్‌, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us