UPDATED 13th MARCH 2022 SUNDAY 12:15 PM
Boy Murdered in Chittoor : చిత్తూరు జిల్లా కలికిరి మండలం అద్దవారి పల్లెలో దారుణం జరిగింది. బాలుడు ఉదయ కిరణ్ మృతి కలకలం రేపుతోంది. మూడు రోజుల నుంచి కనిపించకుండా పోయిన బాలుడు ఉదయ కిరణ్ (8) శవంగా కనిపించాడు. చెట్టుకు ఉరి వేసి, వేలాడుతున్న స్థతిలో ఉదయ్ కిరణ్ మృతదేశం లభ్యమైంది. బాలుడి ఒంటిపై గాయాలు ఉన్నాయి. హత్య చేసి ఉరేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయ్ కిరణ్ స్థానిక పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నట్లుగా తెలుస్తోంది.
గత శుక్రవారం నుంచి బాలుడు ఉదయ్ కిరణ్ కనిపించకుండా పోయాడు. రాత్రి వరకు చుట్టుపక్కల వెతికిన తల్లిదండ్రులు రవి, తులసి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. గడిచిన 48 గంటలుగా ఉదయ్ కిరణ్ కోసం వెతుకుతున్న పోలీసులకు.. ఊరి చివరన చెట్టుకు వేలాడుతున్న ఉదయ్ కిరణ్ మృతదేహం కనిపించింది. వెంటనే స్థానికుల సహాయంతో మృతదేహాన్ని కిందికి దించారు.బాలుడి ఒంటిపై తీవ్ర గాయాలు ఉన్నాయి.
ఈ క్రమంలో ఎవరో అతన్ని తీవ్రంగా హింసించి, చంపి ఆ తర్వాత చెట్టుకు వేలాడదీసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే బాలుడి తండ్రి రవి లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. తమకు ఎవరితోనూ విభేదాలు లేవని, ఇది ఎలా జరిగిందో తెలియడం లేదని అంటున్నారు. పోలీసులు మాత్రం కేసును సీరియస్ గా తీసుకున్నారు. అద్దవారి పల్లిలో పోలీసులు భారీగా మోహరించారు.