UPDATED 18th JANUARY 2018 THURSDAY 11:45 AM
అమరావతి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 22వ వర్థంతి పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎన్టీఆర్ యుగపురుషుడని, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన స్పూర్తి ఎప్పుడూ మన వెన్నంటే ఉంటుందన్నారు. రైతు కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ 33 ఏళ్ల పాటు చలనచిత్ర రంగంలో ఓ వెలుగు వెలిగారని, అనంతరం తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి రావడమే కాకుండా దేశ రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని, సూర్య చంద్రులు ఉన్నంత వరకూ ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా ఉంటుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు అనుగుణంగా నడుచుకోవాలని, ఏ రంగంలో అయినా ఆయనకు ఆయనే సాటి అని సీఎం అన్నారు. రాజకీయాలకు నూతన నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని, అనితర సాధ్యమైన రాజకీయ చరిత్ర సృష్టించిన ఘనుడని, పేదల ఆరాధ్య దైవం, సార్థక నామధేయం, తెలుగు ప్రజల గుండె చప్పుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పరిటాల సునీత, తదితరులు ఎన్టీఆర్కు నివాళులర్పించారు.