UPDATED 4th AUGUST 2022 THURSDAY 07:05 PM
Command And Control Centre : తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించారు. సుమారు రూ.600 కోట్లతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ కేంద్రం.. పోలీసు విభాగానికి మూడో నిఘా నేత్రంగా పని చేయనుంది. రాష్ట్రంలోని సీసీ కెమెరాలను కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. ఒకేసారి సుమారు లక్ష కెమెరాలు వీక్షించేలా కమాండ్ కంట్రోల్ కేంద్రంలో బాహుబలి తెరను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు షిఫ్టుల వారీగా సిబ్బంది పని చేయనున్నారు. సీసీ దృశ్యాలు నిక్షిప్తం చేసేందుకు భారీ సర్వర్లు ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం కేసీఆర్ పరిశీలించారు.
ఏడెకరాల విస్తీర్ణం.. నాలుగు టవర్లు.. అత్యాధునిక టెక్నాలజీ వినియోగం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్‌లో పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మించింది.కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో అన్ని శాఖల సమన్వయానికి సైతం ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీటీవీ కెమెరా దృశ్యాలైనా హైదరాబాద్‌లో ఉన్న ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వీక్షించొచ్చు.
అన్ని జిల్లాలు, పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని సీసీటీవీ కెమెరాలు ఆయా జిల్లా కేంద్రాల్లోని మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానించారు. అక్కడి నుంచి ఫీడ్‌ను నేరుగా సీసీసీకి జోడించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులోని సీసీటీవీ కెమెరాలు, మెట్రోస్టేషన్ల పరిధిలోని సీసీటీవీ కెమెరాల ఫీడ్‌ను సైతం సీసీసీతో అనుసంధానించినట్లు అధికారులు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రం నిర్మించింది.
బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లో ఏడెకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. 5 టవర్లున్న ఈ కేంద్రంలో 6.42 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉంది. భవనం మొత్తం ఎత్తు 83.5 మీటర్లు. టవర్ ‘A’లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంటుంది. 2016 నవంబర్ 22న ప్రారంభమైన కమాండ్ కంట్రోల్ భవన నిర్మాణ పనులు పూర్తవడానికి దాదాపు ఆరేళ్లు పట్టింది. గతంలో ప్రారంభోత్సవానికి రెండుసార్లు ముహూర్తం నిర్ణయించినప్పటికీ పనుల ఆలస్యం కారణంగా వాయిదా పడింది.
ఎట్టకేలకు గురువారం (ఆగస్టు 4) ఈ సెంటర్ అందుబాటులోకి వచ్చింది.ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రజలు కూడా సందర్శించేందుకు వీలుంది. 19 అంతస్తులున్న ఈ భవనంలో సందర్శకులు 14, 15 అంతస్తుల వరకు వెళ్లేందుకు అధికారులు అనుమతిస్తారు. అక్కడి నుంచి నగరాన్ని 360 డిగ్రీల కోణంలో వీక్షించొచ్చు. అయితే ఇందుకోసం కొంత ఛార్జీ వసూలు చేయనున్నారు.
దీంతో పాటు ఆరో అంతస్తులోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి వెళ్లి బయట నుంచే పోలీసులు చేస్తున్న ఆపరేషన్‌ను వీక్షించేందుకూ అనుమతిస్తారు.