TTD: బ్రహ్మోత్సవాల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు: టీటీడీ ఈవో ధర్మారెడ్డి

UPDATED 29th JULY 2022 FRIDAY 06:05 AM

TTD: తిరుమల వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు భక్తుల మధ్య వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం ఆయన కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర రెడ్డి, టీటీడీ అధికారులతో కలిసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిబిడ్డల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం తదితర ప్రివిలేజ్డ్‌ దర్శనాలు రద్దు చేశామన్నారు. సర్వదర్శనం మాత్రమే ఉంటుందని, రూ.300 దర్శన టికెట్లతో పాటు శ్రీవాణి ట్రస్టు దాతలకు, ఇతర ట్రస్టు దాతలకు దర్శన టికెట్లు రద్దు చేశామన్నారు. ఆర్జితసేవలు కూడా రద్దు చేశామని స్పష్టం చేశారు. స్వయంగా వచ్చే ప్రొటోకాల్‌ వీఐపీలకు మాత్రమే బ్రేక్‌ దర్శనం ఉంటుందన్నారు.

పెరటాసి మాసం మూడో శనివారం రోజు గరుడసేవ రావడంతో తమిళనాడు నుంచి భక్తులు భారీగా వచ్చే అవకాశమున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే విషయంపై చర్చించినట్టు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా లడ్డూలు బఫర్‌ స్టాక్‌ ఉంచుకుంటామన్నారు. భద్రత అవసరాల కోసం పోలీసు శాఖ అడిగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.

ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుందన్నారు.అలిపిరి వద్ద ద్విచక్రవాహనాలకు, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు.భక్తులకు సేవలందించేందుకు 3,500మంది శ్రీవారి సేవకులను ఆహ్వానిస్తామన్నారు.5వేల మంది పారిశుధ్య కార్మికులను అదనంగా ఏర్పాటు చేసుకుంటామన్నారు.

నిర్దేశిత ప్రాంతాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఘాట్‌రోడ్డులో ప్రమాదాలు జరక్కుండా చూసేందుకు వీలుగా గరుడసేవరోజు పూర్తిగా, మరుసటి రోజు మఽఽధ్యాహ్నం 12 గంటల వరకు ద్విచక్రవాహనాల రాకపోకలను నిషేధిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి తెలిపారు.

ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ సర్వదర్శనాలు మాత్రమే అమలయ్యే క్రమంలో క్యూలైన్‌ వెలుపలకు వచ్చే అవకాశముందని, క్యూలైన్ల వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. టీటీడీ జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహకిషోర్‌, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ కుమార్‌, ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, గోవిందరాజ దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు, ముఖ్య అర్చకులు కిరణ్‌ దీక్షితులు, ఏఎస్పీ మునిరామయ్య తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us