Medaram: మేడారంలో అప్పుడే భక్తుల మొక్కులు.. కరోనా భయం

UPDATED 23 JANUARY 2022 SUNDAY 07:00 PM

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) : మేడారం జాతర ఇంకా మొదలే కాలేదు. అప్పుడే భక్తుల తాకిడి పెరుగుతోంది. కరోనా వైరస్ మరింత విజృంభిస్తుందనే సమాచారంతో ముందుగానే సమ్మక్క, సారాలమ్మలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు బారులు తీరారు. 2022, జనవరి 23వ తేదీ ఆదివారం సెలవు కావడంతో భక్తులు భారీగా మేడారంకు చేరుకున్నారు. అక్కడ భక్తితో మొక్కులు చెల్లించుకుంటున్నారు. కరోనా కేసులు అధికమౌతుండడంతో జాతర నిర్వహిస్తారా ? లేదా ? అనే సందేహాలు నెలకొన్నాయి. దీంతో ముందుగానే మేడారంకు చేరుకుంటున్నారు.మేడారం పరిసర ప్రాంతాలు భక్తులతో కికిటలాడుతున్నాయి. శనివారం రాత్రి నుంచే ప్రైవేట్ వాహనాల ద్వారా భక్తులు మేడారం చేరుకొని, జంపన్న వాగులో స్నానాలు చేసి.. చీరె, సారలతో పసుపు, కుంకుమలు నిలువెత్తు బంగారం సమర్పించి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాక ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. గతంలో భక్తులను క్యు లైన్ల ద్వారా దూరం నుండి దర్శనం చేసే విధంగా సౌకర్యాలు కల్పించిన అధికారులు ఇప్పుడు ప్రస్తుతం నేరుగా తల్లుల గద్దెల వద్దకే భక్తులను వెళ్ళే విధంగా అవకాశం కల్పించారు.దీనిపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పర్యవేక్షణ చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో వచ్చే భక్తులు మాస్క్ లు ధరించి దర్శనం చేసుకోవాలని, భక్తులు సహకరించాలని కోరారు. ఆదివారం సుమారు రెండు లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని అంచనా. ఇక్కడ శానిటైజ్ లు, మాస్క్ లు ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.మరోవైపు…సమ్మక్క-సారలమ్మ వనదేవతల దర్శనానికి రెండో డోస్‌ వ్యాక్సిన్‌ పత్రం లేదా 24 గంటల్లోపు కరోనా నెగెటివ్‌ రిపోర్టు అయినా చూపించేలా అంక్షలు విధించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మహాజాతర వైద్య, ఆరోగ్య శాఖకు సవాల్‌గా మారటంతో రాష్ట్ర ఉన్నతాధికారులు స్వయంగా రంగంలోకి దిగారు. సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్యశాఖను రిపోర్ట్ ఇవ్వాలని కోరారు. దీంతో మరో పది రోజుల్లోపు నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఫిబ్రవరి మొదటి వారంలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. దీనిలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి సీఎం కేసీఆర్ కూడా మేడారం వెళ్లి మొక్కులు చెల్లించడంపై నిర్ణయం తీసుకుంటారు. కరోనా పరిస్థితిని బట్టి జాతరకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ నివేదిక వచ్చిన తుది నిర్ణయం తీసుకోనుంది సర్కార్.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us